శభాష్.. పోలీస్
సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు
శివ్వంపేట(నర్సాపూర్): ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి కొన ఊపిరితో ఉండగా పోలీసులు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. దెవమ్మగూడం గిరిజన తండాలో మంగళ, బుధ వారాల్లో దసరా పండుగ ఉత్సవాలు నిర్వహించుకున్నారు. తండాకు చెందిన లున్సవత్ రాజు మద్యం మత్తులో బుధవారం అర్థరాత్రి కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండటంతో అతడి అన్న 100 కాల్ చేశాడు. విధుల్లో ఉన్న శివ్వంపేట పోలీస్‌స్టేషన్ బ్లూ కోర్టు సిబ్బంది విష్ణువర్ధన్ రెడ్డి, మహేందర్ తండాకు చేరుకునే సరికే రాజు ఇంట్లోని గదిలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. బ్లూ కోర్టు సిబ్బంది తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లగా ఉరికి వేలాడుతున్నాడు. వెంటనే కిందికి దించి కొన ఊపిరితో ఉండగా విష్ణువర్ధన్‌రెడ్డి సీపీఆర్ చేయడంతో శ్వాస తీసుకున్నాడు. వెంటనే కారులో చికిత్స నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి అక్కడి నుంచి సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీపీఆర్ వల్లనే రాజుకు ప్రాణాపాయం తప్పిందని కుటుంబ సభ్యులు, తండా వాసులు అన్నారు. ఈ సందర్భంగా పోలీసులను గ్రామస్తులు, అధికారులు అభినందించారు.


