కార్పొరేటర్లకు రూ.లక్షల కోట్లు మాఫీ
● పేదల బతుకులతో మాత్రం కేంద్రం చెలగాటం ● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ
దుబ్బాక: కార్పొరేట్ శక్తులకు రూ.లక్షల కోట్లు మాఫీ చేస్తున్న కేంద్రం, పేద ప్రజల బతుకులతో మాత్రం చెలగాటం ఆడుతుందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం దుబ్బాక పట్టణంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి భాస్కర్ అధ్యక్షతన జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను విదేశీ, స్వదేశీ కార్పొరేట్ అప్పగిస్తూ దేశ సంపదను కేంద్రం లూటీ చేస్తుందని విమర్శించారు. 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు మారుస్తూ శ్రమదోపిడికి పాల్పడుతుందన్నారు.గ్యాస్‌పై మళ్లీ రూ.50 పెంచి పేదలను మోసం చేస్తుందన్నారు. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గోపాల స్వామి, భాస్కర్, పద్మ, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మంజుల, శ్యామల, భారతమ్మ, శారద తదితరులు ఉన్నారు. కామ్రేడ్ విమలరనదివే జయంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.


