రక్త పరీక్షే..
వారం రోజులుగా నిలిచిన ముఖ్యమైన టెస్టులు
● టీ హబ్‌లో అందుబాటులో లేని కెమికల్స్
● ఈ కారణంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో
అరకొరగా శాంపిల్స్ సేకరణ
● జిల్లాలోని 53 హెల్త్ సెంటర్లకు
ఇదే ప్రధాన కేంద్రం
● అధికారుల పర్యవేక్షణ కరువు
● ఇబ్బందులు పడుతున్న రోగులు
సిద్దిపేటకమాన్: సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళా శాల అనుబంధ జనరల్ ఆస్పత్రిలోని టీహబ్‌లో రోగ నిర్ధారణకు కెమికల్స్ అందుబాటులో లేకపోవడంతో పలు ముఖ్యమైన పరీక్షలు నిలిచిపోయాయి. జిల్లాలోని 53 ఆరోగ్య కేంద్రాల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను ఈ టీహబ్‌కు పంపిస్తుంటా రు. టీహబ్‌లో రోగ నిర్ధారణ కోసం ఉపయోగించే కెమికల్స్ లేకపోవడంతో ఎల్‌ఎఫ్‌టీ (లివర్ ఫంక్షనింగ్ టెస్ట్), కాల్షియం, లిఫిడ్ ప్రోఫైల్, హెచ్‌బీ ఏఐ సీ (షుగర్ లెవెల్స్), ఎస్ టైఫాయిడ్ వంటి ముఖ్య మైన పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో పరీక్షల కో సం వచ్చిన పేషెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. మరి కొంత మంది ప్రైవేటు ల్యాబ్స్‌కు వెళ్తున్నారు.
53 కేంద్రాల నుంచి శాంపిల్స్ సేకరణ
సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ 300 పడకల జనరల్ ఆస్పత్రి ఆవరణలో టీహబ్‌ను 2021లో ఏర్పాటు చేసి మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రి, అర్బన్ హెల్త్ సెంటర్లు, పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానల నుంచి ప్రతి రోజూ పేషెంట్ల నుంచి రక్త నమునాలు (బ్లడ్ శాంపిల్స్) సేకరించి ఐదు రూట్ల ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల ద్వారా టీ హబ్‌కు పంపిస్తారు. ఇలా ప్రతి రోజూ 53 కేంద్రాల నుంచి శాంపిల్స్ సేకరించి 115 రకాల పరీక్షలు చేస్తారు. వివరాలు టీహబ్ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేసి, పరీక్షల అనంతరం మరుసటి రోజు పేషెంట్ మొబైల్ నంబర్‌కు ఫలితాలు పంపిస్తారు. ఈ రిపోర్టుల ఆధారంగా పేషెంట్లు వైద్య సేవలు పొందుతారు. రోగ నిర్ధారణ పరీక్షల కోసం గత ప్రభుత్వ హయాంలో టీ హబ్‌ను కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పలు యంత్రాలు కొనుగోలు చేసి, సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నారు.
కెమికల్స్ లేకపోవడంతోనే..
టీహబ్‌లో పలు రకాలు పరీక్షలు నిలిచిపోవడంతో పేషెంట్లు, ప్రజలు వ్యయ ప్రయాసాలకు గురవుతున్నారు. ఈ కారణంతో పలు ముఖ్య పరీక్షలు ఆగిపోయాయి. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయని సిబ్బందిని అడిగితే కెమికల్స్ లేవనే సమాధానం చెబుతున్నారని.. ఎప్పుడు వస్తాయో తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని పలువురు పేషెంట్లు చెప్పుకొచ్చారు. జిల్లా నుంచి రోజు సుమారు 500 నుంచి 600 మంది నుంచి శాంపిల్స్ సేకరిస్తారు. వీటిలో హెచ్‌బి, టైఫాయిడ్, డెంగీ, ఇతర విష జ్వరాలు, థైరాయిడ్, విటమిన్‌లు, రక్త కణాలు, కిడ్నీ, లివర్, కొలెస్ట్రాల్ వంటి మొత్తం 115 రకాల పరీక్షలు నిర్వహిస్తారు. వారం రోజు లుగా కెమికల్స్ అందుబాటులో లేకపోవడంతో ముఖ్యమైన 15 రకాల పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు.
కెమికల్స్ రాగానే చేస్తాం
టీ హబ్‌లో రోగ నిర్ధారణ పరీక్షల కోసం వినియోగించే కెమికల్స్ కోసం ఇప్పటికే ఇండెంట్ పెట్టడం జరిగింది. కెమికల్స్ రాగానే అన్ని రకాల పరీక్షలు జరుగుతాయి. జీజీహెచ్‌లోని ఓపీ, ఐపీ పేషెంట్లకు పరీక్షలు నిర్వహిస్తున్నాం. పీహెచ్‌సీల నుంచి వచ్చే శాంపిల్స్‌కు మాత్రం కావడం లేదు. మరో రెండు, మూడు రోజుల్లో అన్ని రకాల పరీక్షలు అందుబాటులోకి వస్తాయి.
– అనిల్, నోడల్ ఆఫీసర్
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. గత ప్రభుత్వ హయాంలో స్థానికంగా వైద్యారోగ్యశాఖ మంత్రి ఉండటంతో వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించారు. కానీ ప్రస్థుత పరిస్థితులలో వైద్యారోగ్యశాఖ మంత్రి వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశాలు నిర్వహించపోవడంతో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సిబ్బంది సైతం సమయ పాలన పాటించడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి టీహబ్‌లో అన్ని రకాల పరీక్షలు జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు.


