మహిళా విద్యకు ఆద్యుడు పూలే
సంగారెడ్డి/సంగారెడ్డి జోన్ : దేశంలో మహిళా విద్యకు ఆద్యుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కొనియాడారు. జిల్లాలో జ్యోతిరావ్ పూలే 199వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రజాసంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మహనీయునికి నివాళులర్పించారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమానికి మంత్రి దామోదర రాజనర్సింహ టీజీఐఐసీ నిర్మలారెడ్డి, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌లతో కలిసి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం ఇచ్చిన మహనీయుడు పూలే అన్నారు. సత్యశోధక సమాజం ద్వారా నిరుపేదలకు వివాహాలు జరిపించడంతోపాటుగా ఎన్నో పాఠశాలలు, వసతిగృహాల ద్వారా అనేకమంది విద్యార్థుల జీవితాల్లో పూలే వెలుగులు నింపారని గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు చంద్రశేఖర్, మాధురి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో పూలే జయంతి వేడుకలు
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, అధికారులతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆడిటోరింయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
మంత్రి దామోదర రాజనర్సింహ
జిల్లాలో ఘనంగా పూలే 199వ జయంతి వేడుకలు


