డబ్బుల కోసమే మహిళ హత్య
● నిందితుడి రిమాండ్
● గతంలోనూ పలు హత్యలు చేసి జైలుకి
● ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
నర్సాపూర్: డబ్బుల కోసం మహిళను హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక సీఐ కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. నర్సాపూర్ మండలంలోని జైరాంతండాకు చెందిన మెఘావత్ భుజాలీ (52) గత నెల 25న కనిపించడం లేదని కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో భుజాలీ 3న మెదక్ మార్గంలోని అడవిలో కుళ్లిన మృతదేహమై కనిపిచింది. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా మహబూబ్‌నగర్ జిల్లా అదే మండలంలోని అయ్యగారిపల్లె తండాకు చెందిన కెథావత్ గోపాల్ హత్య చేసినట్లు గుర్తించారు. భుజాలీకి మాయ మాటలు చెప్పి స్థానిక బస్టాండ్ ఏరియా నుంచి మెదక్ మార్గంలోని డంప్‌యార్డు పక్కన ఉన్న అడవిలోకి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆమెకు మద్యం తాగించి చీరతో ఉరేసి చంపి ఆమె వద్ద ఉన్న రూ.400 తీసుకొని వెళ్లాడని వివరించారు.
గతంలోనూ హత్యలు చేసి జైలుకి
గోపాల్‌పై గతంలోనే పలు కేసులు ఉన్నాయని, డబ్బులతోపాటు వారి వద్ద ఉండే చిన్నపాటి వెండి నగల కోసం హత్యలు చేస్తుంటాడని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో మూడు హత్యలు చేసినట్లు నిందితుడు అంగీకరించాడని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలో సైతం రెండు కేసులు ఉన్నాయన్నారు. వికారాబాద్ జిల్లా బొమ్మరాస్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో ఓ హత్య కేసులో పదేళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడని ఎస్పీ వివరించారు. సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, స్థానిక సీఐ జాన్‌రెడ్డి, ఎస్‌ఐ లింగం, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.


