
చల్లని పొదరిల్లు
మండు వేసవిలోనూ కూల్ కూల్..
● చెక్కు చెదరని గడీల ఇల్లు, పెంకుటిళ్లు ● తాతల కాలం నాటి ఇళ్లనుకాపాడాకుంటున్న వారసులు ● సీజన్ ఏదైనా ఆహ్లాదకరం ● పర్యావరణహితం..పాతకాలం నాటి భవనం
ఎండలు మండిపోతున్నాయి.. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు.. వేడిమిని తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావడం లేదు.. చాలా మంది ఇంట్లోనే ఉంటూ ఏసీలు, కూలర్లు వాడుతూ చల్లదనాన్ని పొందుతున్నారు. ఇవి ఎంత వాడినా న్యాచురల్‌గా వచ్చే గాలి వేరు. ప్రస్తుతం కొన్ని ఇళ్లు ఎంత ఎండ కొట్టినా చల్లదనాన్ని పంచుతున్నాయి. మట్టి గోడలతో నిర్మితమైన అతి పురాతన ఇళ్లు, ఇంటి పైకప్పులో పేర్చిన కలప, చెక్క వంటి వాటితో ఇళ్లు ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. పెంకుటిళ్లు కూడా ఎన్నేళ్లు అయినా చెక్కు చెదరకుండా కూల్‌గా ఉంటాయి. కొందరైతే తాతల కాలం నుంచి వచ్చిన ఇళ్లను రూ.లక్షలు ఖర్చు చేసి మోడ్రన్ ఇల్లుగా మార్చుతున్నారు. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండి ఎలాంటి వాతావరణంలోనైనా చల్లదనాన్ని పంచే ఇళ్లపై ప్రత్యేక కథనం..
పర్యావరణ హితం.. ఆ ఇల్లు
చిన్నకోడూరు(సిద్దిపేట): పర్యావరణ హితం.. వాతావరణ అనుకూలం లక్ష్యంగా మట్టి, ఇసుక, సిమెంట్, డంగ్ సున్నంతో కలిసి చేసిన ఇంటి నిర్మాణం ఆహ్లాదాన్ని అందిస్తుంది. మండు టెండలో సైతం చల్లదనాన్ని ఇస్తుంది. చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన కొండం లక్ష్మారెడ్డి రిటైర్డ్ ఉద్యోగి. తన ఇంటిని వినూత్న రీతిలో నిర్మించారు. కేరళ ప్రాంతంలో అధికంగా ఇలాంటి ఇళ్ల నిర్మాణాలు ఉంటాయి. తెలంగాణలో మొదటి సారిగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఈ ఇళ్లు ఏడాది కాలం పాటు వర్షాకాల, శీతాకాల, వేసవికాలాలకు అనుగుణంగా ఉంటుంది. తక్కువ డబ్బులతో వాతావరణ, వాయుకాలుష్యం నుంచి రక్షణ కలిపిస్తుంది. ఏసీలు, కూలర్‌లు అవసరం లేదు. ఆరోగ్యపరంగా ఇంటి నిర్మాణం బహుళ ప్రయోజనం.
మోడ్రన్ పెంకుటిల్లు
సొబగులు అద్ది.. చల్లగా తీర్చిదిద్ది
రూ.లక్షలు వెచ్చించి ఇంటిని పునర్నిర్మాణం
సిద్దిపేటరూరల్: ఎండాకాలం పెంకుటిల్లును మించిన చల్లదనం ఉండదు. ఇలాంటి క్రమంలో ఎంతమంచి బిల్డింగ్ కట్టుకున్నా ఎండాకాలం వేడిని నుంచి సాధారణ ఉపశమనం పొందడం వీలుకాదు. అలాంటి ఇబ్బందులను తొలగించుకుంటూ చిన్నగుండవెళ్లి గ్రామానికి చెందిన కోటగిరి యాదగిరి గౌడ్, కొత్తపల్లి చంద్రం పాత ఇల్లునే అందంగా నిర్మించుకొని మోడ్రన్ పెంకుటిల్లుగా మార్చుకున్నారు. బయట నుంచి చూస్తే పెంకుటిల్లు మాత్రమే కాని లోపికి వెళ్లి చూస్తే ఇంద్రభవనం, బిల్డింగ్ వంటి అనుభూతిని పొందేలా అధునాతన పద్ధతిలో నిర్మించుకున్నారు. తన తాతలు, తండ్రుల నుంచి వచ్చిన ఇల్లు కాబట్టి దానిని కూల్చేందుకు మనసు రాక రూ.40 లక్షలకు పైగా వెచ్చించి మోడ్రన్ ఇంటిని నిర్మించారు. చల్లని గాని, వెలుతురు వచ్చేలా విశాలమైన గదులు, బెంగుళూరు పెంకులు, టేకు కర్రతో, అందమైన కళాకృతులతో తలుపులు బిగించారు. ప్రస్తుతానికి ఇల్లు పెంకుటిల్లా.. భవంతి ఇల్లా అన్నట్లుగా చూపరులను ఆకర్శిస్తుంది. ఎండాకాలం అయినా చల్లని వాతావరణం కలిగి ఉండడం విశేషం.

చల్లని పొదరిల్లు

చల్లని పొదరిల్లు

చల్లని పొదరిల్లు

చల్లని పొదరిల్లు