
త్వరలో ట్రిపుల్‌ఆర్ పరిహారం!
కసరత్తు చేస్తున్న రెవెన్యూ అధికారులు
తూప్రాన్: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)గా వాడుకలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు సంబంధించి భూసేకరణ పనులు చివరి దశకు చేరాయి. రైతులకు పరిహారం అందించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. భూసేకరణలో అన్ని ప్రక్రియలు ముగిసి, నష్ట పరిహారం నిర్ణయించే అవార్డు దశలో ఉన్నట్లు తెలుస్తోంది. రైతులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, ఇతర వివరాలను రెవెన్యూ సిబ్బంది సేకరించి నేషనల్ హైవే అథారిటీ వెబ్‌సైట్ భూమి రాశి పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఈ నమోదు ప్రక్రియ సాంకేతికంగా సంక్లిష్టంగా ఉండడంతో ఆలస్యం అవుతున్నట్టు సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. భూసేకరణ నోటిఫికేషన్ వచ్చిన 2022 నాటి సబ్ రిజిస్టార్ ప్రాథమిక విలువల ఆధారంగానే నష్టపరిహారం చెల్లించే పరిమితి ఉన్నట్లుగా తెలిసింది. అంతకుమించి ఎక్కువ రేటుకు ఆర్డీఓ నిర్ణయించడం చట్ట ప్రకారం చెల్లదని, కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే రైతులకు వీలైనంత మంచి ధరను పరిహారంగా చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా చొరవ తీసుకున్నారు. నేషనల్ హైవే చట్టంలోని ఆర్బిట్రేషన్ అనే ప్రక్రియను ఉపయోగించి రైతులకు న్యాయం చేయవచ్చు అని, ఆ బాధ్యతను కలెక్టర్‌కు అప్పగించినట్లు తెలిసింది. దానికి అనుగుణంగా రెవెన్యూ సిబ్బంది ముమ్మరంగా పనుల్లో నిమగ్నమవుతున్నారు. రైతులకు ఈ ప్రక్రియ మీదున్న సందేహాలను నివృత్తి చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో కూర్చొని నోటీసులు ఇవ్వకుండా, రైతుల ఇంటి వద్దకే వెళ్లి నోటీసులు ఇస్తూ, వారికి భరోసాను కల్పిస్తున్నారు. మొత్తం మీద నెల రోజుల్లో వారికి ఆర్డీఓ, కలెక్టర్ నిర్ణయించే ధర ప్రకారం రైతుల అకౌంట్లో డబ్బులు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.