
అసంపూర్తిగా గోపాల మిత్ర భవనాలు
ఇబ్బందులు పడుతున్న పశు పోషణదారులు, రైతులు
న్యాల్‌కల్(జహీరాబాద్): ప్రభుత్వం పక్కా భవనాలు మంజూరు చేస్తున్నా వాటిని సకాలంలో పూర్తి చేయకపోవడంతో అటు అధికారులు, ఇటు పశు పోషణదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం భవనాల మంజూరులో చూపుతున్న శ్రద్ధ తదనంతరం చూపకపోవడంతో ఏళ్ల తరబడి భవనాలు పూర్తి కావడం లేదనే పలువురు విమర్శిస్తున్నారు. అందుకు మండలానికి మంజూరైన గోపాల మిత్ర భవనాలను నిదర్శనంగా చెప్పవచ్చు. గ్రామాల్లో పశువుల కృత్రిమ గర్భధారణపై అవగాహన కల్పించి వాటి అందుకు మందులను వేసేందుకు 2001లో ప్రభుత్వం గోపాల మిత్ర పథకాన్ని ప్రవేశ పెట్టింది. అందులో భాగంగా ప్రారంభంలో ఇద్దరు, ముగ్గురు గోపాల మిత్రలను నియమించింది. గర్భోత్పత్తికి సంబంధించిన ద్రావణాన్ని భద్ర పర్చుకునేందుకు వారికి కంటెయినర్ (3 లీటర్ల సామర్థ్యం) ఇచ్చింది. అయితే మందులను భద్ర పరిచేందుకు, పశువులకు చికిత్సలు నిర్వహించేందుకు భవనాలు లేకపోవడంతో గోపాల మిత్రలు, పశు పోషణదారులు ఇబ్బందులు పడేవారు. వారి ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం 2013లో మండలానికి రెండు గోపాల మిత్ర భవనాలను మంజూరు చేసింది. రూ.15.20లక్షలతో టేకూర్, ముంగి గ్రామాలకు ఒక్కొక్కటి చొప్పున భననాలు మంజూరు చేసింది. ఆ తర్వాత చాలాకాలానికి టెండర్లు వేశారు. పదేళ్లకు భవన నిర్మాణం పనులు ప్రారంభించారు. రెండు గ్రామాల్లో చేపట్టిన భవన నిర్మాణం పనులు చిన్న చిన్న పనులు మినహా ఏడేళ్ల క్రితం పూర్తయ్యాయి. భవన నిర్మాణం పనులు పూర్తయినప్పటికీ ఇంకా కొన్ని పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి.
కరెంట్ లేక నిరుపయోగంగా మారిన భవనం
టేకూర్‌లో నిర్మించిన భవనంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో అది నిరూపయోగంగా మారింది. ముంగిలో నిధుల కొరత కారణంగా భవనం నిర్మాణం పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. భవనం నిర్మించినప్పటీకీ నిధులు సరిపోకపోవడంతో తలుపులు, కిటికీలు ఏర్పాటు చేయలేదు. వర్షానికి దెబ్బతినకుండా ఉండేందుకు కిటికీలకు రేకులు, కట్టెలను ఏర్పాటు చేశారు. బాత్ నిర్మాణం పనులు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గోపాల మిత్ర భవనాల నిర్మాణం పనులు పూర్తి చేయించాలని మండలంలోని ఆయా గ్రామాల గోపాల మిత్రలు, పశు పోషణదారులు కోరుతున్నారు.
వినియోగంలోకి తేవాలి
గ్రామంలో నిర్మించిన గోపాల మిత్ర భవనం పనులు దాదాపు పూర్తయినప్పటీకీ దానికి కిటికీలు, తలుపులు బిగించకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. భవనం పనులు అసంపూర్తిగా ఉండటంతో సామగ్రిని అందులో పెట్టుకోవడం లేదు. మిగిలి పోయిన చిన్న చిన్న పనులను వెంటనే పూర్తి చేయించి భవనాన్ని వినియోగంలోకి తేవాలి.
–జనార్ధన్‌రెడ్డి,గోపాల మిత్ర–ముంగి
చర్యలు తీసుకుంటాం
మండలంలో గోపాల మిత్ర భవనాలు అసంపూర్తిగా ఉన్నట్లు నాకు తెలియదు. మండల ఏఈగా ఇటీవలే వచ్చాను. క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం.
–మహేశ్,
పంచాయతీ రాజ్ ఏఈ–న్యాల్‌కల్

అసంపూర్తిగా గోపాల మిత్ర భవనాలు