
జీతాలిస్తేనే నీళ్లు వదిలేది
జీతాల కోసం ఆందోళన చేపట్టిన మిషన్‌భగీరథ కార్మికులు 73 గ్రామాలకు నిలిచిపోయిన నీటి సరఫరా
న్యాల్‌కల్(జహీరాబాద్): న్యాల్‌కల్ మండలంతో పాటు సమీపాన గల ఝరాసంగం మండలంలోని పలు గ్రామాల్లో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. అయితే మిషన్ భగీరథ కార్మికులకు ఎనిమిది నెలలుగా జీతాలు లేకపోవడంతో వారంతా విధులను బహిష్కరించారు. జీతాలిస్తేనే నీళ్లు వదిలేదంటూ తెగేసి చెప్తున్నారు. దీంతో ఈ నెల 20 నుంచి ఆ పథకం ద్వారా 73 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎనిమిది నెలలుగా జీతాల్లేవు
న్యాల్‌కల్ మండల పరిధిలోని 39 గ్రామాలతో పాటు తండాలు, ఝరాసంగం మండలంలోని సుమారు 34గ్రామాలతో పాటు తండాలకు నీటి సరఫరాను అందించేందుకు రాఘవాపూర్ వద్ద ఫిల్టర్ బెడ్‌ను ఏర్పాటు చేశారు. నిత్యం ఇక్కడి నుంచి ఆయా గ్రామాలకు నీటి సరఫరా జరుగుతుంది. అందులో తాత్కాలిక పద్ధతిన 23 మంది కార్మికులు పని చేస్తున్నారు. వారికి ఎనిమిది నెలలుగా జీతాలు రావడం లేదు. వచ్చే కొద్ది జీతాలు కూడా కాంట్రాక్టర్ సమయానికి ఇవ్వకపోవడం వల్ల వారు ఆందోళన బాట పట్టారు. జీతాలు సమయానికి చెల్లించకపోవడం వల్ల తాము ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు చెల్లించే వరకు నీటి సరఫరాను చేయమని చెబుతున్నారు. దీంతో ఆయా గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయిరది. అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో బోరు బావుల ద్వారా నీటి సరఫరా జరుగుతున్నా ఆ నీరు సరిపోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలే దసరా.. ఆపై నీళ్లు లేవు
దసరా పండుగకు నీటి అవసరం ఎంతో ఉంటుంది. తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నియమ నిష్టలతో నిర్వహిస్తారు. ఇళ్లను శుభ్రం చేసే దగ్గర నుంచి ఇంట్లో ఉన్న అన్ని దుస్తులను కూడా శుభ్ర పరుస్తారు. వీటన్నింటికి నీరు ఎంతో అవసరం ఉంటుంది. ఇలాంటి సమయంలో నీటి సరఫరా నిలిచి పోవడం వల్ల తాము నానా ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకుని నిలిచిపోయిన తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
పండుగ వేళ పానీ పాట్లు