
నైపుణ్యాలను పెంచుకోవాలి
సంగారెడ్డి జోన్: మారుతున్న కాలానికనుగుణంగా పోటీ ప్రపంచంలో ప్రతీ విద్యార్థి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. సంగారెడ్డి ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏటీసీ కేంద్రాన్ని శనివారం మంత్రి టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో యువకుల్లో నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించడం జరిగిందన్నారు. యువకుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు ఏటీసీ సెంటర్లు దోహదపడతాయని చెప్పారు. విద్యార్థులకు ప్రత్యేకంగా సాంకేతిక రంగంలో శిక్షణనిచ్చి ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
దివ్యాంగులకు పరికరాలు పంపిణీ
జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 138 మంది దివ్యాంగులకు మంత్రి దామోదర దివ్యాంగ పరికరాలు పంపిణీ చేశారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 16 మంది దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే సైకిళ్లు, 36 మందికి ట్రై సైకిళ్లు, 35 మందికి వీల్ చైర్లు, 15 మందికి మీడియం సైజ్ కుర్చీలు, 15 మందికి లార్జ్‌సైజ్ కుర్చీలు, 11 మంది వినికిడి లోపం ఉన్నవారికి హియరింగ్ బర్డ్స్, పదిమంది అంధులకు బ్లైండ్ వాకింగ్ స్టిక్ లు పంపిణీ చేశారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి, ఆత్మ కమిటీ చైర్మన్ రామ్‌రెడ్డి, అదనపు లేబర్ కమిషనర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ