
సజావుగా పోషణ మాసోత్సవాలు
న్యాల్‌కల్(జహీరాబాద్): పోషకాహారంపై అవగాహన లేమి కారణంగా సరైన ఆహారాన్ని తీసుకోకపోవడంతో పోషకాలు అందక పిల్లలు, గర్భిణులు, బాలింతలు వ్యాధుల బారిన పడుతున్నారు. బాలింతలు, గర్భిణులు రక్తహీనతో సతమతమవుతుండగా, పుట్టిన బిడ్డల ఎదుగుదలపై కూడా ప్రభావం పడుతోంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తోంది. అందులోభాగంగా ఈ ఏడాది కూడా తొమ్మిది రోజులుగా ఊరూరా పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా 1,504 కేంద్రాలు
జిల్లాలో 1,504 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. 1,432 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు పని చేస్తున్నారు. ఆయా కేంద్రాల పరిధిలో 9,907 మంది గర్భిణులు, 9,265 మంది బాలింతలు, 1,02,143 మంది చిన్నారులు ఉన్నారు. వీరందరికీ అంగన్‌వాడీ కార్యకర్తలు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఈ మాసోత్సవాల్లో తల్లిదండ్రులతోపాటు ఆశ వర్కర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, వైద్య సిబ్బంది పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరిస్తున్నారు.
ఇవీ కార్యక్రమాలు
అక్టోబర్ 16వరకు నాలుగు వారాల పాటు నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో భాగంగా గర్భిణులు, బాలింతలతో సమావేశాలతోపాటు వంటల పోటీలు ఏర్పాటు చేశారు. పిల్లల బరువు, ఎత్తు, కొలతలు తీసుకోవడంతోపాటు చక్కెర, నూనె వినియోగం, చిరుధాన్యాలపై అవగాహన కల్పిస్తారు. కేంద్రాల్లో బొమ్మల ప్రదర్శన, కథలు చెప్పడం, పోషణ లోపం ఉన్న పిల్లలకు వైద్య పరీక్షలు, రక్తహీనత, అధిక బరువు వల్ల వచ్చే సమస్యలపై అవగాహన కల్పిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈసీసీఈ కార్నర్ ఏర్పాటు, కూరగాయలు, పెరటి తోటల పెంపకం గురించి వివరించడంతోపాటు గర్భిణుల ఇళ్లను సందర్శన చేయనున్నారు.
పోషకాహారంపై
అవగాహన కల్పిస్తోన్న అధికారులు
వచ్చే నెల 16 వరకు మాసోత్సవాలు