
జలం.. పుష్కలం
మెట్ట నేలల్లోని బావుల్లో నీరు
హుస్నాబాద్‌రూరల్: జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయి. అడుగులోతులో నీరు ఉండటంతో మెట్ట నేలల్లోని ఊట బావులు నిండు కుండలా దర్శనమిస్తున్నాయి. వానాకాలం మొదట్లో వర్షాలు లేక, బావుల్లో నీరు లేక రైతులు సాగుకు ఇబ్బందులు పడ్డారు. భూగర్భ జలాలు జులై చివరి వరకు 30 అడుగుల లోతులో ఉన్నాయి. 60 రోజుల్లోనే పైకి రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వానాకాలం వరి నాట్లు ఆలస్యమైనా, యాసంగి పంటలకు కావల్సిన నీళ్లు బావుల్లో ఉండటంతో పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. హుస్నాబాద్ మెట్ట ప్రాంతానికి సాగు నీటి ప్రాజెక్టులు లేకపోవడంతో రైతులు గొలుసు కట్టు చెరువులు, ఊట బావులు, బోరు బావుల్లో వచ్చే నీటితోనే పంటలు సాగు చేస్తారు. యాసంగి సాగుకు రైతులు విత్తనాలను సేకరిస్తున్నారు. రైతులకు వ్యవసాయ బావుల్లో నీటి లభ్యత పెరగడంతో యాసంగి పంటల సాగుపై ఆశలు పెంచుకుంటున్నారు.
ప్రతి నెల లెక్కిస్తారు..
భూగర్భ జలశాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల జలాలు లెక్కిస్తారు. గ్రామాల్లో 30 కి.మీలకు ఒక బోరు బావిని ఏర్పాటు చేసి భూగర్భ జలాల అభివృద్ధిని లెక్కిస్తారు. కోహెడ మండలం రాంచంద్రాపూర్, హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్, జనగామ జిల్లా నర్మెట్టలో ఏర్పాటు చేసిన బోరు బావుల్లో నీటి లభ్యతను భూగర్భ జలశాఖ అధికారులు లెక్కించారు. మే నెలలో 28 అడుగుల లోతున ఉన్న జలం జూలైలో 30 అడుగుల కిందకు పడిపోయింది.
నీటి కోసం భగీరథ ప్రయత్నం
హుస్నాబాద్ మెట్ట ప్రాంతం కావడంతో నీటి వనరులు లేక భూగర్భ జలాలు అడుగంటి పోయి పంట చేళ్లకు సాగు నీరు లేక రైతులు ఇబ్బందులు పడేవారు. వేసవిలో వ్యవసాయ బావిపై క్రేన్ వేసి లోతుగా తవ్వుకుంటారు. ఒక్కొక్క రైతు రూ.2లక్షల నుంచి రూ.6లక్షల వరకు పెట్టుబడి పెట్టినా యాసంగి చివరి పంటలకు సాగు నీరు అందక ఎండిపోయి నష్టపోయేవారు. పదేళ్ల నుంచి ఎప్పుడు చూడని నీటి ఊటలు రావడంతో బావుల్లో నీరు చేతికి అందే ఎత్తులో వచ్చాయి. దీంతో యాసంగికి ఇబ్బందులు ఉండవని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలల కింద 30 అడుగుల లోతులో..
భారీ వర్షాలకు ౖపైపెకి
యాసంగికి నీటి కష్టాలు తప్పినట్టే
అడుగు ఎత్తులో నీరు
రాష్ట్ర భూగర్భ జలశాఖ, స్వాన్ ఎన్విరాన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ భూగర్భ జలాలను లెక్కిస్తుంది. జూన్‌లో 30 అడుగులకు పడిపోయిన ఊట నీరు ఇప్పుడు అడుగు ఎత్తులోకి వచ్చేసింది. వర్షాలు క్రమం తప్పకుండా పడటంతో వ్యవసాయ పంటలకు నీటి వినియోగం తగ్గి వర్షం నీరు చెరువు, కుంటల్లోకి చేరి భూగర్భ జలాలు పెరుగుతున్నాయి.
– ఎం.డీ. నసీర్, స్వాన్ ప్రతినిధి

జలం.. పుష్కలం