మాటలే తప్ప చేతలేవీ..?
● మైనార్టీలకు అన్యాయం చేసిన సర్కార్ ● కేబినెట్‌లో వారికి చోటేది..? ● హామీల అమలులో విఫలం ● సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం
రామచంద్రాపురం(పటాన్‌చెరు): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి మాటలు తప్ప చేతలు శూన్యమని మండిపడ్డారు. శనివారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్‌నగర్‌లో మాజీ సర్పంచ్ మల్లెపల్లి సోమిరెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మైనార్టీల సంక్షేమానికి రూ.4వేల కోట్లు ఇస్తానని హామీనిచ్చిందన్నారు. అయితే గత బడ్జెట్‌లో రూ.3వేల కోట్లు మాత్రమే కేటాయించి ఇప్పటివరకు కేవలం రూ.వెయ్యికోట్లే ఖర్చు చేసిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మైనార్టీ యువతకు, మహిళలకు కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని, దానితోపాటు సకాలంలో షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక సాయం అందించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మత ఘర్షణలు పెచ్చుమీరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో ఒక మైనార్టీ మంత్రి కూడా లేరని కనీసం వారికి ఎమ్మెల్సీ సీటు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ లౌకికవాద పార్టీ అని చెప్పుకుంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీతో ఉన్న అనుబంధాన్ని వ్యక్త పరిచారని గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తే మైనార్టీల కాంగ్రెస్‌కు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
కాంగ్రెస్
ప్రభుత్వమే కారణం
తెల్లాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడటానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని హరీశ్‌రావు ఆరోపించారు. గత ప్రభుత్వ హాయాంలో తెల్లాపూర్ ప్రజల అవసరాల కోసం రూ.500 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమిని కేటాయించి అందులో కోట్లాది రూపాయలతో ఫంక్షన్ హాల్‌ను నిర్మించామని అయితే ఇప్పటికీ అది ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదని మండిపడ్డారు. అదేవిధంగా వెజ్ నాన్‌వెజ్ మార్కెట్ కోసం నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులను వెనక్కి తీసుకుందని విమర్శించారు. పెండింగ్ నిధులను ఇచ్చి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతకుముందు తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయాన్ని ఆనుకొని నిర్మించిన ఫంక్షన్ హాల్, అసంపూర్తిగా ఉన్న వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను ఆయన సందర్శించారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి, రసమయి బాలకిషన్, గువ్వల బాల్రాజ్, మాజీ వైస్ చైర్మన్ రాములుగౌడ్, సీనియర్ నాయకులు ఎల్లయ్య, బాల్‌రెడ్డి, ఆదర్శ్‌రెడ్డి, గోవర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment