నిర్మాణానికి రూ.44.12 కోట్లు మంజూరు ● విద్యార్థుల్లో హర్షాతిరేకాలు
హుస్నాబాద్: స్థానికంగా ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి హుస్నాబాద్‌లో శాతవాహన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్థాపనకు అడ్మినిస్ట్రేటివ్ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కళాశాలలో బీటెక్ (సీఎస్‌ఈ), ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, బీటెక్ (ఐటీ), బీటెక్ (ఈసీఈ) ప్రతి ప్రొగ్రాంలో 60 సీట్లను కేటాయించారు. కళాశాల నిర్మాణం కోసం రూ.44.12 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇటీవల ఇంజనీరింగ్ కళాశాల కోసం కలెక్టర్ మనుచౌదరి, శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఉమేష్ కుమార్ అనువైన స్థలాలను పరిశీలన చేశారు.
ఎన్నో ఏళ్ల నిరీక్షణ
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కళాశాల కావాలన్న ఈ ప్రాంత ప్రజలు, విద్యార్థుల కల నెరవేరనుంది. హుస్నాబాద్‌లో డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు మాత్రమే ఉన్నాయి. పైచదువులు చదవాలంటే పట్టణాలు, నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. నియోజకవర్గంలో గిరిజన జనాభా అధికం. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.. పొన్నం ప్రభాకర్‌ను గెలిపిస్తే మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఏదో ఒక విద్యాసంస్థ వస్తుందని విద్యార్ధి లోకం ఎదురు చూసింది. మెడికల్ కళాశాల ఏర్పాటుకు సైతం జిల్లెల్లగడ్డలో కలెక్టర్ పలు మార్లు స్థలాన్ని పరిశీలించారు. దీంతో ఈ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురించాయి. మెడికల్ కళాశాలకు అనుబంధంగా 250 పడకల ఆస్పత్రి ఉండాలనే నిబంధనతో మంత్రి పొన్నం ప్రభాకర్ 250 పడకల ఆస్పత్రిని మంజూరు చేయించడమే కాకుండా ఆస్పత్రి నిర్మాణానికి రూ.88 కోట్లు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. ప్రస్తుతం హుస్నాబాద్‌లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేయడంతో విద్యార్థి లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. అలాగే అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి, తోటపల్లి, జనగామ గ్రామాల్లోని 124.36 ఎకరాల భూమిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థల సేకరణపై గ్రామ సభల ద్వారా రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ జిల్లాలకు ఏటు చూసిన 40 కి.మీ. పరిధిలో హుస్నాబాద్ కేంద్ర బిందువుగా ఉంది. ఎల్కతుర్తి నుంచి హుస్నాబాద్ మీదుగా సిద్దిపేట వరకు జాతీయ రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇన్ని హంగులతో విద్యాసంస్ధలు, ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటైతే హుస్నాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా, విద్యాపరంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంది.


