అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా పల్లెలను పట్టించుకోకపోవడంతో ప్రజల అవస్థలు అన్నీ ఇన్నీకావని మంగళవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి గళమెత్తారు. కేసీఆర్ హయాంలో గ్రామీణ ప్రగతి వికాసంతో పల్లెలు జాతీయ స్థాయిలో ప్రతిష్ట పొందగా నేడు కన్నీరు పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వడంలేదన్నారు. మాజీ సర్ప ంచ్‌ల చేసిన పనుల బిల్లులు ఇంత వరకు ఇవ్వకపోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై వెంటనే ప్రభు త్వం సమీక్షించి సమస్యలు పరిష్కరించాలన్నారు.
వల్లభాపూర్‌ను నార్సింగ్ మండలంలో చేర్చండి
ఉమ్మడి చేగుంట మండలంలోని వల్లభాపూర్‌ను నార్సింగ్ మండలంలో చేర్చాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అసెంబ్లీలో కోరారు. చేగుంట, నార్సింగ్ కొత్త మండలాలుగా ఏర్పాటయ్యాయన్నారు. వల్లాభాపూర్‌ను నార్సింగ్ మండలంలోకి, అలాగే భీమరావుపల్లిని చేగుంట మండలంలోకి చేర్చాలని విన్నవించారు. ఈ రెండు గ్రామాలు సాంకేతిక కారణాలతో ఓ మండలంలో ఉండాల్సిన గ్రామం మరో మండలంలో ఉన్నాయని, దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ రెండు గ్రామాలను సరిచేయాలని కలెక్టర్‌కు పలుసార్లు విన్నవించానన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.


