సీపీ అనురాధ
సిద్దిపేటకమాన్: పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని సీపీ అనురాధ తెలిపారు. పోలీసు కమిషనరేట్ పరిధి భూంపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ఏఎస్‌ఐ నుంచి ఎస్‌ఐగా పదోన్నతి పొందిన జె.బాలమల్లయ్య, సీఏఆర్ హెడ్ క్వార్టర్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున ఏ.వెంకట్‌రెడ్డి హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. దీంతో వారు మర్యాదపూర్వకంగా సీపీని గురువారం కలవడంతో వారిని సీపీ అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదోన్నతులు పొందిన సిబ్బంది రెట్టింపు ఉత్సాహాంతో ప్రజలకు సేవలందించాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ కార్తీక్, రాష్ట్ర పోలీసు సంఘం ఉపాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మహిళల రక్షణకు పెద్దపీట
మహిళల రక్షణకు పెద్దపీట వేయాలని సీపీ అనురాధ తెలిపారు. గజ్వేల్ డివిజన్ పోలీసు అధికారులతో సీపీ కార్యాలయంలో పెండింగ్ కేసులపై గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీపీ మాట్లాడుతూ..పోక్సో, క్రైమ్ కేసులలో నిందితులను వెంటనే అరెస్టు చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ లేజర్ గన్‌తో కేసులు నమోదు చేయాలన్నారు. క్రికెట్ బెట్టింగ్స్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
రేపటి నుంచి సిటీ పోలీస్ యాక్ట్
పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈనెల 29 నుంచి సిటీ పోలీస్‌యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ అనురాధ తెలిపారు. ఏప్రిల్ 13 వరకు నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆమె తెలిపారు.


