చరిత్రాత్మకం: మంత్రి పొన్నం
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
హుస్నాబాద్: దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించడం చరిత్రాత్మకమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని బుడగ జంగాల కాలనీలో తెల్లరేషన్ కార్డులదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 17,263 చౌక ధరల దుకాణాల ద్వారా 2.91 లక్షల రేషన్ కార్డులదారులకు సన్న బియ్యం పంపిణీ జరుగుతోందన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే ఇంటికి చేరే ముందే వేరే వాళ్ళకు అమ్మడం, రేషన్ దుకాణాలకు వాపస్ ఇవ్వడం జరిగేదన్నారు. ఇక నుంచి సన్న బియ్యం అందరూ తీసుకుంటారన్నారు. అందరికీ ఆరోగ్యం బాగుండాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యాలు కలగజేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం సన్న బియ్యం పఽథకం ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు.
గజ్వేల్‌రూరల్: సన్నబియ్యం పంపిణీతో లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని ఆత్మకమిటీ చైర్మన్ మల్లారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ రేషన్ దుకాణంలో సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. గతంలో సరఫరా అయిన దొడ్డు బియ్యాన్ని తినకపోవడంతో అవి పక్కదారి పట్టేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు చెక్ పెట్టి, పేద ప్రజల కడుపు నింపే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇదిలా ఉండగా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సింగారంలో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి లబ్ధిదారులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమాల్లో ఏఎంసీ వైస్‌చైర్మన్ సర్ధార్‌ఖాన్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చరిత్రాత్మకం: మంత్రి పొన్నం


