చట్టాలపై అవగాహన అవసరం
జిల్లా జడ్జి స్వాతిరెడ్డి
సిద్దిపేటరూరల్: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ, జడ్జి స్వాతిరెడ్డి విద్యార్థులకు సూచించారు. మంగళవారం చింతమడకలోని మహాత్మాజ్యోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతిరెడ్డి మాట్లాడుతూ బాలల హక్కులపై ప్రతీ ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. విద్యార్థులు జీవితంలో విజయం సాధించాలంటే నిరంతరం కష్టపడాలన్నారు. అనంతరం ఎస్‌ఐ అపూర్వరెడ్డి మాట్లాడుతూ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో హక్కులపై అవగాహన ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మాధవీలత, అడ్వకేట్ అరవింద్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
మహిళల రక్షణకు పెద్దపీట
సిద్దిపేటకమాన్: మహిళలు, చిన్నారుల రక్షణకు పెద్దపీట వేస్తున్నట్లు సీపీ అనురాధ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని షీటీమ్, యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అధికారులు, సిబ్బంది గత నెలలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. గత నెలలో 48మంది ఈవ్‌టీజర్లను పట్టుకుని కేసులు నమోదు చేసి, కౌన్సెలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. ఎవరైనా పోకిరీలు వేధించినా, వెంటపడినా డయల్ 100 లేదా షీటీమ్ వాట్సప్ నంబర్ 87126 67434కు సమాచారం అందించాలన్నారు.
అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశా..
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక: నియోజకవర్గ అభివృద్ధి కోస మే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో పాటు పలు అభివృద్ధి పనులు మంజూరు చేయాలని కోరిన వెంటనే సీఎం స్పందించడంతో కృతజ్ఞతలు తెలిపానన్నారు. దుబ్బాక రెవెన్యూ డివిజన్, రింగ్ రోడ్డుతో పాటు పలు రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. నాకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని, రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్ అడుగుజాడల్లోనే ముందుకు నడుస్తానని ఆయన అన్నారు.
చక్రధర శర్మకు సన్మానం
గజ్వేల్‌రూరల్: గౌరీభట్ల చిక్రధరశర్మను వీరశైవ లింగాయత్ సమాజం మంగళవారం సన్మానించింది. విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలను అందించింది. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండలం రిమ్మనగూడకు చెందిన గౌరీభట్ల చక్రధరశర్మ ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రిమ్మనగూడకు చెందిన వీరశైవ లింగాయత్ లింగ బలిజ సమాజం సభ్యులు చక్రధరశర్మ దంపతులకు శాలువా కప్పి సన్మానించారు.
‘యువ వికాసం’ సద్వినియోగం చేసుకోవాలి
గజ్వేల్‌రూరల్: ప్రభుత్వం చేపట్టిన యువ వికాసం పథకాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని డీబీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేణు సూచించారు. గజ్వేల్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి రంగాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. 14 వరకు గడువు పొడగించారని; ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నారాయణ, అరుణ్ పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన అవసరం
చట్టాలపై అవగాహన అవసరం


