కాంగ్రెస్ పాదయాత్ర రసాభాస
సిద్దిపేటరూరల్: కాంగ్రెస్ పాదయాత్ర రసాభాసగా మారింది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించడాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేపట్టారు. గురువారం మండల పరిధిలోని తోర్నాల గ్రామంలో పాదయాత్రను నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలు సమన్యాయాన్ని పొందారన్నారు. ఇదిలా ఉండగా తోర్నాల గ్రామంలో ప్రధాన వీధుల నుంచి పాదయాత్ర చేపడుతున్న క్రమంలో మండల అధ్యక్షుడి విషయంలో నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఒకరినొకరు తోసుకోవడంతో గందరగోళంగా మారింది. అక్కడే ఉన్న పోలీసులు, నాయకుల జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగించారు. ప్రధానంగా మండలానికి అధ్యక్షుడు ఉన్నారా? లేరా? అసలు అధ్యక్షుడు ఎవరు? అనే అనుమానాలను ప్రజలు, నాయకులు లేవనెత్తారు. గ్రామాల్లో కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో మండల అధ్యక్షుడిగా ఎవరికి గుర్తింపు ఇవ్వాలో తెలియడం లేదంటూ పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. కార్యక్రమంలో ముత్యాల బుచ్చిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పాండు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నాయకుల మధ్య వాగ్వాదం
మండల అధ్యక్షుడి విషయమై గొడవ


