జీవజాతులను కాపాడుకుందాం
● పర్యావరణంతోనేమానవజాతికి మనుగడ ● సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సుధాకర్‌రెడ్డి
సిద్దిపేటఎడ్యుకేషన్: రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా జీవజాతులను గుర్తించి పరిరక్షించవచ్చని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) హైదరాబాద్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సుధాకర్‌రెడ్డి అన్నారు. పర్యావరణ సమతుల్యత సమగ్రాభివృద్ధి అనే అంశంపై సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతరించి పోతున్న జీవజాతులను పరిరక్షించుకోవాలని తద్వారా పర్యావరణం సమతుల్యంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ జీవజాతులను కాపాడుకునేందుకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. వరల్డ్‌వైడ్ లైఫ్ ఫండ్ స్టేట్ డైరెక్టర్ ఫరీదా తంపాల మాట్లాడుతూ పర్యావరణం బాగుంటేనే మానవజాతికి మనుగడ ఉంటుందన్నారు. ప్రొఫెసర్ రామనాథన్ మాట్లాడుతూ నీటి కాలుష్యంతో సముద్రంలోని జీవజాతులకు నష్టం వాటిల్లుతోందన్నారు. సముద్రజీవజాతులకు పొంచి ఉన్న ప్రమాదాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ సదస్సుకు ఆయా రాష్ట్రాల నుంచి పరిశోధనా పత్రాలు వచ్చాయాన్నారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు ప్రదర్శించిన వాల్‌పోస్టర్‌లను పరిశీలించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు.


