సాగునీటి ఇబ్బందులు తలెత్తొద్దు
● కాలువల పనులు వేగిరం చేయాలి ● నీటిపారుదల సమీక్షలో హరీశ్‌రావు
సన్‌ఫ్లవర్ కేంద్రాలు కొనసాగించండి
సిద్దిపేట రూరల్: సన్‌ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు కొనసాగించేలా చొరవ చూపాలని కలెక్టర్ మనుచౌదరిని ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. శుక్రవారం కలెక్టర్‌ను కలిసి పలు సమస్యలు వివరించారు. నియోజకవర్గ పరిధిలోని చిన్నకోడూర్ ప్రాంత రైతులు సన్ ఫ్లవర్ పెద్ద ఎత్తున సాగు చేసినట్లు వివరించారు. కాళేశ్వరం కాలువల నిర్మాణాలకు భూసేకరణలో జాప్యం జరుగుతోందని, పనులను వేగవంతం చేయాలని కోరారు.
సిద్దిపేటజోన్: రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తవద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో మల్లన్న, రంగనాయకసాగర్ కాల్వల స్థితిగతులు, నీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ వచ్చే యాసంగి పంట వరకు శాశ్వతంగా కాల్వలు ఏర్పాటు చేయాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలోని పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇర్కోడ్ లిఫ్ట్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో సాగునీటి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.
పాలనలో సీఎం ఫెయిల్
భూముల అమ్మకాల పేరిట మూగ జీవాల గోస పోసుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డిని చివరికి మూగ జీవాలు కూడా క్షమించవని హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన వరంగల్ రజతోత్సవ సభసన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైడ్రా పేరిట విధ్వంసం చేసి పేద ప్రజల జీవితాలను నాశనం చేశారన్నారు. రేవంత్‌రెడ్డి పాలన ఫెయిల్ అయ్యిందని, ఆయనను తిట్టని ఊరు లేదన్నారు. రుణమాఫీ అమలు సగం వరకు సాగిందని, ఇక కాదని సీఎం చేతులు ఎత్తివేశారని విమర్శించారు. వానాకాలం రైతుబంధు లేదన్నారు. రేవంత్ రెడ్డికి పాలన చేయడం రావట్లేదని, ఆయన మాటలు అన్ని బోగస్ అని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల చేర్యాల, మద్దూరు, బచ్చన్న పేట, జనగామలలో 50 వేల ఎకరాల పంట ఎండిపోయిందన్నారు. ప్రభుత్వం పై వత్తిడి తెచ్చి రంగనాయకసాగర్ లోకి నీళ్లు తేవడం వల్లే సిద్దిపేట నియోజకవర్గంలో ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదని, ప్రభుత్వ వైఫల్యాలను వరంగల్ సభలో ఎండగడతామన్నారు.


