● కొందరు ఆర్థిక ఇబ్బందులతో దూరం ● పైలెట్ ప్రాజెక్ట్‌గా
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ముందడుగు పడటం లేదు. పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి అర్హులకు ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా 26 మండలాల్లోని 26 గ్రామాల్లో 2,667 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలతో పలువురు లబ్ధిదారులు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. – సాక్షి, సిద్దిపేట
ఉచితంగా ఇసుక సరఫరా చేయాలి
మాకు సొంత ఇల్లు లేదు. ఇటీవల ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. అయితే ఇసుక సమస్య ఉండటం వల్ల ఇంటి నిర్మాణం ప్రారంభించడం ఆలస్యం అవుతోంది. అధికారులు ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తే మాకు ఆర్థికంగా భరోసా కల్పించినట్లు అవుతుంది.
– పొన్నబోయిన యాదయ్య, లబ్ధిదారుడు, ధర్మారం
జిల్లా వ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్ట్‌లో ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో 533 మంది మాత్రమే ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పోశారు. అందులో ఇప్పటి వరకు 78 గృహాలు మాత్రమే బెస్మింట్ స్థాయి వరకు నిర్మించారు. మంజూరు పత్రాలను అందజేసి 75రోజులవుతున్నా చాలా మంది ఇంటి నిర్మాణాలను ప్రారంభించలేదు. ప్రస్తుతం నిర్మించే వారికి మొదటి బిల్లు రాగానే ప్రారంభిస్తామని.. మరి కొందరు ఇసుక కొరతతో.. ఇంకొందరు ముగ్గు పోసినా ఆర్థిక ఇబ్బందులతో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
2.30లక్షల మంది దరఖాస్తు
జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కోసం 2,30,483 మంది దరఖాస్తు చేశారు. వాటిని క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి అర్హులను ఎంపిక చేశారు. సొంత ఇంటి స్థలం ఉండి పక్కా ఇల్లు లేనివారు 76,337 మంది. అసలే ఇంటి స్థలం లేనివారు 34,404. అనర్హులుగా 1,19,742 మందిని గుర్తించారు. వీరిలో ప్రభుత్వం మంజూరు చేసే నియోజకవర్గానికి 3,500 ఇళ్లలో ఎంపిక చేయనున్నారు. 400 నుంచి 600 ఫీట్లలోపు స్థలంలోనే ఇంటి నిర్మాణం సడలింపు ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
●
ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నాం
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారు ఇంటి నిర్మాణం బెస్మింట్ లెవల్ వరకు నిర్మించిన వారికి మొదటి బిల్లు కోసం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నాం. త్వరలో మొదటి బిల్లు బ్యాంక్ అకౌంట్‌లో జమఅవుతాయి. కొంత మంది మంచి ముహూర్తాలు లేవని కొందరు, పాత ఇంటినికూల్చివేసేందుకు ఇంకొందరు సమయం తీసుకుంటున్నారు.
– దామోదర్, పీడీ, హౌసింగ్
● కొందరు ఆర్థిక ఇబ్బందులతో దూరం ● పైలెట్ ప్రాజెక్ట్‌గా
● కొందరు ఆర్థిక ఇబ్బందులతో దూరం ● పైలెట్ ప్రాజెక్ట్‌గా


