కాలువలు నిర్మించే వరకు పోరాడుతాం
దుబ్బాకరూరల్: నియోజకవర్గంలో సాగునీటి కాలువలు పూర్తి చేసేవరకు పోరాడుతామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం పోతారం గ్రామంలో ఎమ్మెల్యే దంపతులు సీతారాముల కల్యాణమహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న చెరువులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయని అన్నారు. ఇంకా అక్కడక్కడా కాలువలు పూర్తి కాలేదని వాటిని పూర్తి చేసే దాకా పోరాడుతానని తెలిపారు. శ్రీరామనవమి రోజున తన సొంత గ్రామమైన పోతారం చెరువుకు నీళ్లు రావడం సంతోషంగా ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో నిండిన చెరువును పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్య కార్యకర్తలతో సమావేశం
దుబ్బాక: క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్‌లో ఈ నెల 27 జరిగే బీఆర్‌ఎస్ బహిరంగ సభకు నియోజక వర్గం నుంచి భారీ సంఖ్యలో శ్రేణులు హాజరుకావాలన్నారు. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కార్యకర్తలు అంకుఠిత దీక్షతో పనిచేయాలన్నారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు బానాల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, నాయకులు ఉన్నారు.
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి


