సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం కావాలి
గజ్వేల్: సంపూర్ణ ఆరోగ్యమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని, ఇందుకోసం వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని గజ్వేల్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం ఆస్పత్రి సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ కలుషితమైన ఆహారం, నీరు, గాలికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య పరిరక్షణ మన చేతుల్లోనే ఉంటుందని చెప్పారు. ప్రజల్లో ఆరోగ్యంపై స్పృహను పెంచడమే లక్ష్యంగా ర్యాలీని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓ రాము, డ్యూటీ డాక్టర్ నవ్యరావు, డాక్టర్ తర్జనితోపాటు సిబ్బంది పాల్గొన్నారు.


