రాజ్యాంగం మార్చే కుట్ర
వర్గల్(గజ్వేల్): దేశంలో రాజ్యాంగం మార్చే కుట్ర జరుగుతోందని, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడదామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ప్రీతమ్ అన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ నినాదంతో గ్రామస్థాయి పాదయాత్రను సోమవారం మండల కేంద్రం వర్గల్‌తోపాటు గౌరారంలో డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకేసారి రిజర్వేషన్లు ఎత్తివేస్తే ప్రజలు తరిమికొడతారని, మెల్లమెల్లగా వాటిని తీసే ప్రక్రియ చేపడుతున్నారని ఆరోపించారు. గచ్చిబౌలి భూములపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం అక్కడ చెట్లు నరకలేదని, జింకలు, నెమళ్లను చంపలేదని స్పష్టం చేశారు. పదేళ్లు దోచుకున్న డబ్బుతోనే బీఆర్‌ఎస్ నేతలు సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరంలో కులగణన చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. గురుకులం అందరిది ఒకే కులం అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదేనన్నారు. పేదవారికి సన్నబియ్యం పంచిన ఘనత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. మన డబ్బు తింటూ ఫామ్‌హౌస్‌లో పడుకున్న వాళ్లను నిద్రలేపాల్సిన అవసరముందన్నారు. ఈ సందర్భంగా వర్గల్‌లో సన్నబియ్యం లబ్ధిదారుడు అయ్యగల్ల యాదగిరి ఇంట్లో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి తదితరులతో కలిసి కుటుంబీకులతో సహపంక్తి భోజనం చేశారు. పాదయాత్ర కార్యక్రమంలో ఆయనతోపాటు యూత్‌కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి రంగారెడ్డి, రాష్ట్ర యూత్‌కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్, మండల పార్టీ అధ్యక్షుడు సందీప్‌రెడ్డి, ప్రభుదాస్‌గౌడ్, భానుప్రసాద్, సాయిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గచ్చిబౌలి భూములపై
ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం
సన్నబియ్యం పంపిణీ ఘనత కాంగ్రెస్‌దే
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ప్రీతమ్


