పేదల నడ్డివిరుస్తున్న మోదీ సర్కార్
సిద్దిపేటఅర్బన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి పేదల నడ్డివిరుస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ మండిపడ్డారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిద్దిపేటలోని గాంధీ చౌరస్తా వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మంద పవన్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి, సామాన్య ప్రజలపై భారం మోపుతూ వంట గ్యాస్ ధరలను పెంచడం దారుణమన్నారు. వంట గ్యాస్‌పై ఏకంగా రూ.50 పెంచడం, పెట్రోల్, డీజిల్‌పై రూ.2 పెంచి ఆయిల్ కంపెనీలు భరించాలని ప్రకటించడం దుర్మార్గమని అన్నారు. పేదల జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా ప్రదాని మోదీ పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్, శంకర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు బన్సీలాల్, మల్లేశం, జనార్ధన్, చంద్రం, నరేష్, నాయకులు సంపత్, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.
పెంచిన గ్యాస్ ధరను తగ్గించాల్సిందే
సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్
ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం


