
అప్పుల బాధ తాళలేకవ్యక్తి ఆత్మహత్య
జహీరాబాద్ టౌన్: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పపడిన ఘటన అల్గోల్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జహీరాబాద్ మండలంలోని అల్గోల్‌కు చెందిన ఉప్పరి వెంకట్(50)కు నాలుగు ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం పనులు చేస్తూ ఫైనాన్స్ బిజినెస్ చేశాడు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో అప్పు బారిన పడ్డాడు. భూమి తాకట్టుపెట్టి కొంత అప్పులు తీర్చాడు. అయినా అప్పులు తీరకపోవడంతో బాధ భరించలేక గురువారం పొలంలో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కుటుంబ కలహాలతో వలస కూలీ
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరులో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అసోం రాష్ట్రానికి చెందిన బిషాల్(30) జీవనోపాధికి తెల్లాపూర్ మున్సిపల్‌కు వలసొచ్చాడు. ఆరు నెలలుగా కొల్లూరులోని కారు వాషింగ్ సెంటర్‌లో పని చేస్తున్నాడు. గురువారం తెల్లావారుజామున కారు వాషింగ్ షెడ్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు షెడ్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.