
అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లు
● పైరవీలకు తావులేదు ● రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్
ఇళ్ల నిర్మాణాలు వేగిరం చేయాలి
కొండపాక(గజ్వేల్): ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎలాంటి పైరవీలకు తావులేదని, అర్హులకే మంజూరు చేస్తామని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతమ్ అన్నారు. కుకునూరుపల్లి మండలం మేదినీపూర్‌లో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను సోమవారం పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల్లో ప్రభుత్వం చూపిన కొలతల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించుకునే ఇళ్లకు సైతం పథకం వర్తించేలా చూడాలని గ్రామస్తులు ప్రత్యేకాధికారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారుల ఖాతాల్లో మొదటి విడత డబ్బులు వేసే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. గ్రామంలో 75 ఇళ్లు మంజూరు కాగా 11 మాత్రమే ప్రారంభమయ్యాయన్నారు. ఇళ్ల మంజూరు కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు. పేదలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎంపీడీఓలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేటరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగిరం చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు. స్థలం ఉండి పూర్తిగా ఇల్లు కట్టుకునే స్తోమత లేని నిరుపేదలను మాత్రమే గుర్తించాలని అన్నారు. ఆర్థిక సహకారం కోరుకునే వారికి మహిళా సమాఖ్యల ద్వారా రుణం ఇప్పించేలా అధికారులు చొరవ చూపించాలన్నారు. ప్రాధాన్యత క్రమంలో పూర్తయ్యే ఇంటి నిర్మాణ పనులను పంచాయతీ సెక్రటరీ పోర్టల్‌లో నమోదు చేయాల్సిన అవసరం లేదన్నారు. లబ్ధిదారుడే తన స్మార్ట్ ఫోన్‌లో ఇంటి నిర్మాణ ఫొటోలను ఎప్పటికప్పడు అప్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. వాటి ఆధారంగా బిల్లుల్లో ఆలస్యం జరగదన్నారు. అసంపూర్తిగా, చివరిస్థాయిలో ఉన్న డబుల్ బెడ్రూం నిర్మాణ పనులపై మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన మేరకే నిర్మాణ పనులు పూర్తి చేసేలా చూడాలన్నారు. అనంతరం కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపికలో ఒక్క అనర్హుడు ఉండకుండా జాగ్రత్త వహించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, హౌసింగ్ పీడీ దామోదర్ రావు, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, గజ్వేల్, హుస్నాబాద్ ఆర్డిఓలు చంద్రకళ, రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
లబ్ధిదారులతో సమావేశం
మండల పరిధిలోని వెంకటాపూర్‌ను గౌతమ్ సందర్శించారు. లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 183 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందించామన్నారు. వారిలో 21 మంది మార్కింగ్ చేసుకోవడంతో పాటు 11 మంది బేస్మెంట్ పూర్తి చేసుకున్నారన్నారు. నిర్మాణానికి సంబంధించి సామగ్రి ధరలు పెరిగాయని లబ్ధిదారులు చెప్పడంతో ఇసుకను ఉచితంగా అందించడంతో పాటుగా ధరల నియంత్రణపై చర్చలు జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లు