
బీఆర్‌ఎస్ రక్షణ కవచం
తెలంగాణకు శ్రీరామరక్ష
రజతోత్సవ సభకు అద్భుతమైన స్పందన●
● పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం
● ‘సాక్షి’తో ఎమ్మెల్సీ, రచయిత, గాయకుడు దేశపతి శ్రీనివాస్
బీఆర్‌ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ తెలంగాణ ప్రజల రక్షణ కవచమని ఎమ్మెల్సీ, రచయిత దేశపతి శ్రీనివాస్ అన్నారు. పార్టీ తెలంగాణను పునఃనిర్మాణం చేసిందని, కాంగ్రెస్‌కు అధికారం తప్ప.. ప్రజల గురించి ఆలోచించడంలేదని తెలిపారు. రజతోత్సవ సభకు అద్భుతమైన స్పందన వస్తోందని, మూడేళ్ల తర్వాత బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దేశపతి శ్రీనివాస్‌ను రజతోత్సవం సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే..
సాక్షి, సిద్దిపేట: సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఒక అనాథ.. తెలంగాణకు అన్యాయం జరిగితే అడిగే దిక్కులేదు. వివక్షకు గురవుతుంటే అడిగే వారేలేరు. కాంగ్రెస్‌లో ఉన్న నాయకులు తెలంగాణను ఒక అంగడి సరుకు చేసి తమకు పదవి రానప్పుడల్లా ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌ను ఎత్తు కోవడం పదవి రాగానే దించడం చేశారు. దీంతో ప్రజల్లో ఉద్యమంపై, ప్రత్యేక రాష్ట్రం వస్తుందని ఆశ లేకుండా పోయింది. 1969లో 369 బలిదానాలు జరిగినా కేంద్రంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాసింది. సరిగ్గా ఈ సమయంలోనే ప్రత్యేక రాష్ట్రంపై ప్రజల్లో కేసీఆర్ ఆశలు చిగురింపజేశారు. గులాబీ జెండాను ఎత్తి 2001లో జలదృశ్యంలో టీఆర్‌ఎస్(బీఆర్‌ఎస్)ను ఏర్పాటు చేశారు. అప్పటి వరకు మూగబోయిన తెలంగాణ ఉద్యమం సింహగర్జన చేసింది. నిర్జీవమైన ఉద్యమం మళ్లీ ప్రాణం పోసుకుంది. అనేక ఉద్యమాలతో అప్పటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. బీఆర్‌ఎస్ పార్టీ జెండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట. తెలంగాణను పునఃనిర్మాణం చేసిన చరిత్ర బీఆర్‌ఎస్ పార్టీది. పదేళ్ల పరిపాలనలో చల్లగా బతికింది. కేసీఆర్ పరిపాలనలో భూమి మీద నీళ్లు పారాయి. కేసీఆర్ వచ్చిన తర్వాతనే పెండింగ్ ప్రాజెక్ట్‌లు పూర్తి, కొత్తగా కాళేశ్వరం నిర్మించి, పాలమూరు ఎత్తిపోతల పథకంను 80శాతం, సీతారామను 90శాతం, అనేక చెక్ డ్యాంలు నిర్మాణాలయ్యాయి. దీంతో చెరువులు బాగుపడ్డాయి.
జలాలు.. ధాన్యం రాశులు
ఆనాడు నీటి కోసం అలమటించిన తెలంగాణ.. కేసీఆర్ సీఎం అయ్యాక ఏటు చూసినా జల రాశులు, పంట రాశులు దర్శినమిచ్చాయి. కరోనా వచ్చినా రాష్ట్ర ఆర్థిక ప్రగతి ఆగలేదు. పదేళ్లలో ఆర్థిక వృద్ధి పెరగడంతోపాటు 1.60లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఆ ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులను తీసుకవచ్చింది బీఆర్‌ఎస్ పార్టీ. పల్లెలు పట్టణాలు అభివృద్ధి చెందాయి. అభివృద్ధిని జీర్ణించుకోలేని విపక్షాలు దుష్ప్రచారాలు చేశాయి. గోరంతను కొండంతగా చూపించాయి. ప్రజలను తప్పుదోవ పట్టించాయి. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్‌ఎస్ లేని రాజకీయాలను ఊహించలేం. కొంత ఆత్మపరిశీలన చేసుకున్నాం. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన, సంక్షేమ పథకాలు అమలు ఎలా ఉండేవి అన్న ఆలోచన ప్రజలు చేస్తున్నారు.
కాంగ్రెస్ తీరు అర్థమైంది..
కాంగ్రెస్ నేతలకు అధికారం అనుభవించాలనే కోరిక తప్ప.. ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన లేదు. కాంగ్రెస్ పార్టీతో అన్ని కోల్పోతున్నామని ప్రజలకు అర్థమవుతోంది. కాళేశ్వరం నీటితో చెరువులు నింపుతున్న పరిస్థితి లేదు. చెరువులు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. మళ్లీ కరువు వచ్చేస్తోంది. కరెంట్ సమస్యలు వస్తున్నాయి. పదేళ్లలో ఆర్థిక వృద్ధి రేటు పెరిగితే సంవత్సరం నుంచి క్షీణత మొదలైంది. రియల్ రంగం కుదేలైంది. దీంతో తెలంగాణ తిరోగమన దిశ ప్రారంభమైంది.
కేసీఆర్ మాటలు వినాలని..
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు అద్భుతమైన స్పందన వస్తోంది. కేసీఆర్‌ను చూడాలని.. ఆయన మాటలు వినాలని గులాబీ దండు కదిలివస్తోంది. బండ్లు కట్టుకుని.. నడచుకుంటూ వరంగల్‌కు చేరుకుంటున్నారు. రజతోత్సవం బీఆర్‌ఎస్ పండుగే కాదు.. ప్రజల ఆత్మగౌరవం. కచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి జరగాలన్నా.. రైతు బంధు రావాలన్నా.. బడుగులకు భరోసా దొరకాలన్నా.. బీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. మూడేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం.