కేసీఆర్ ఇలాకాలో ఘనంగా రజతోత్సవం
గజ్వేల్: మాజీ సీఎం కేసీఆర్ ఇలాకా గజ్వేల్‌లో బీఆర్‌ఎస్ రజతోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డితో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జై తెలంగాణ అంటూ నినాదాలను హోరెత్తించారు. ఆ తర్వాత వరంగల్ సభకు బయలుదేరే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్‌లో భయం మొదలైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, బీఆర్‌ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్‌మీరా తదితరులు పాల్గొన్నారు.


