
బతిమిలాడి ఆయిల్‌పామ్ పంట వేయించా..
ఫ్యాక్టరీని చూస్తుంటే ఆనందభాష్పాలు వస్తున్నాయి ఎమ్మెల్యే హరీశ్‌రావు భావోద్వేగం నర్మేటలో ఫ్యాక్టరీని సందర్శించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
నంగునూరు(సిద్దిపేట): ‘ఆయిల్‌పామ్ పంటకు నేను జిమ్మెదారిగా ఉంటా అని రైతులను బతిమిలాడి పంటను సాగు చేయించా. లాభాలు గడించిన రైతులను, నిర్మాణం పూర్తయిన ఫ్యాక్టరీని చూస్తుంటే ఆనంద బాష్పాలు వస్తున్నాయి’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు బావోద్వేగానికి లోనయ్యారు. నంగునూరు మండలం నర్మేటలోని ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని సోమవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్, ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలసి హరీశ్‌రావు సందర్శించారు. ఫ్యాక్టరీలో కలియ తిరుగుతూ యంత్రాలను, నీటి స్టోరేజీ ట్యాంక్, విద్యుత్ ఉత్పత్తి యూనిట్ పని తీరు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో మండుటెండలో చెరువులు, చెక్‌డ్యామ్‌లు మత్తడి దూకడంతో నాటి కరువు ప్రాంతం నేడు సస్యశ్యామలమైందన్నారు.
కేసీఆర్, హరీశ్‌కు ధన్యవాదాలు
చేర్యాల మండలానికి కూతవేటు దూరంగా నర్మేట లో నిర్మించిన ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుబీమా, కరెంటు, విత్తనాలు, ఎరువులు, సాగు నీరందించడంతో పాటు నకిలీ ఎరువులు అమ్మితే పీడీ యాక్ట్ పెట్టడంతో నేడు 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతోందన్నారు. కేసీఆర్, హరీశ్‌రావు కృషి పలితంగా ఈప్రాంతం సస్యశ్యామలమైందన్నారు. ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక నియోజక వర్గంలో పెద్ద ఎత్తున ఆయిల్‌పామ్ సాగు చేసే లా కృషి చేస్తామన్నారు. దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రాణంగా ప్రేమించే సిద్దిపేటను హరీశ్‌రావుకు అప్పగించడంతో ఎంతో అభివృద్ధి చేశారన్నారు. యాదవరెడ్డి మాట్లాడుతూ కరువు ప్రాంతంగా ఉన్న సిద్దిపేటను దేశానికే మోడల్‌గా తీర్చిదిద్దిన ఘనత హరీశ్‌కే దక్కిందన్నారు.