
దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా, ఆయాలుగా గౌరవ వేతనంపై విధులు నిర్వహించేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంచినీళ్ల బండ, బొంపల్లి, ఆరెపల్లి, తునికిశాల, సంగీత, నంగునూరు, బంజేరుపల్లి, ఆర్‌అండ్ ఆర్‌కాలనీ గజ్వేల్ ఆర్‌అండ్ ఆర్ కాలనీ గజ్వేల్–2లలో ఉపాధ్యాయులుగా, ఆయాలుగా ఖాళీలు ఉన్నాయన్నారు. వీటిలో విధులు నిర్వహించుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులకు రూ.8వేలు, ఆయాలకు రూ.6వేలు గౌరవవేతనం అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 27లోగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి
దుబ్బాక ఆస్పత్రి ఎదుట సీఐటీయూ ధర్నా
దుబ్బాక: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలుచేయాలని సీఐటీయూ జిల్లా కోషాధికారి భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక వంద పడకల ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ హేమరాజ్‌సింగ్‌కు వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనాలు అమలుచేయకుండా కాంట్రాక్టర్ మోసం చేస్తున్నారన్నారు. కార్మికులకు న్యాయపరంగా దక్కాల్సిన వేతనాలతో పాటు సౌకర్యాలు అమలుపర్చాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ దుబ్బాక పట్టణ కన్వీనర్ భాస్కర్, సాజిద్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఈత చెట్లకు పూజలు
గజ్వేల్‌రూరల్: మండల పరిధిలోని అహ్మదీపూర్‌లో గౌడ సంఘం నాయకులు ఈత చెట్లకు పూజలు చేశారు. సోమవారం ఈత వనంలో ఈదులు గీసేందుకు ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతియేటా దసరాకు నూతనంగా కల్లు దుకాణాలను ప్రారంభించడం జరుగుతుందని, ఇందులో భాగంగానే ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం