
అద్దె బస్సు.. కస్సు!
జీతాలు పెంచాలంటూ డ్రైవర్ల నిరసన డిపోలకే పరిమితమైన హైర్ బస్సులు సిద్దిపేట డిపోలో 53.. పండుగ వేళ ప్రయాణికుల పాట్లు
సిద్దిపేటకమాన్: సిద్దిపేట ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు తమ జీతాలు పెంచాలంటూ విధులు బహిష్కరించి డిపో ఎదుట నిరసన తెలిపారు. దీంతో అద్దె బస్సులన్నీ సోమవారం డిపోకే పరిమితమయ్యాయి. బతుకమ్మ, దసరా పండుగ వేళ ఊరెళ్లేవారికి సరిపడా బస్సులు లేక, సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది.
నిత్యం వేల కిలోమీటర్లు..
సిద్దిపేట ఆర్టీసీ డిపోలో 53 అద్దె బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు సిద్దిపేట డిపో నుంచి నిత్యం జేబీఎస్, హన్మకొండ, కామారెడ్డి, వేములవాడ, మెదక్, రామాయంపేట రూట్లలో తిప్పుతారు. ఈ బస్సులు రోజూ 20వేల కిలోమీటర్ల ద్వారా సుమారు 25వేల మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరవేస్తుంటారు. అద్దె బస్సు యజమానులు హైర్ బస్సు డ్రైవర్లకు ప్రతి నెలా (15రోజులు డ్యూటీ) రూ.15వేలు వేతనంగా చెల్లిస్తుంటారు. కానీ తమకు వేతనం సరిపోవడం లేదని, తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమకు మరో రూ.5వేలు వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం విధులు బహిష్కరించి డ్రైవర్లు నిరసన తెలిపారు. అధికారులు కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే తిప్పారు. అద్దె బస్సుల్లో రెండు బస్సులను వాటి యజమానులే నడపగా.. మిగిలిన బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. దీంతో పలు రూట్లలో సరిపడా బస్సులు లేక, సమయానికి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులకు ఎదురుచూపులు తప్పలేదు.
నిలిచిన బస్సులు..
వేతనాలు పెంచాలి
సిద్దిపేట ఆర్టీసీ డిపోలో అద్దె బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాను. రోజు విడిచి రోజు విధులు నిర్వహిస్తున్నాను. నెలలో 15రోజులు డ్యూటీ చేస్తాను. ప్రతి బస్సుకు ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. వేతనం రూ.15వేలు మాత్రమే చెల్లిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. వేతనాలు పెంచి ఆదుకోవాలి. – ప్రశాంత్, అద్దె బస్సు డ్రైవర్
ప్రయాణికులకు ఇబ్బందులు రానివ్వం
హైర్ బస్సు డ్రైవర్లు వేతనాలు పెంచాలని డ్యూటీకి రాలేదు. 53 అద్దె బస్సుల్లో రెండింటిని వాటి యజమానులే (ఓనర్ కమ్ డ్రైవర్) నడుపుతున్నారు. మిగతా బస్సులు నడవట్లేదు. ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా సేవలు అందిస్తున్నాం. హైర్ బస్సు యజమానులు డ్రైవర్లతో మాట్లాడుతున్నారు. త్వరలో విధుల్లో చేరుతారని భావిస్తున్నాం.
– రఘు, సిద్దిపేట డిపో మేనేజర్

అద్దె బస్సు.. కస్సు!

అద్దె బస్సు.. కస్సు!