
ఏ స్థానం ఎవరికో?
జోరందుకున్న ‘స్థానిక’ సందడి
జిల్లాలో 508 జీపీలు, 230
ఎంపీటీసీలు, 26 జెడ్పీటీసీలు
కసరత్తు పూర్తి చేసిన అధికార యంత్రాంగం
నేడు పంచాయతీ కమిషనర్‌కు
రిజర్వేషన్ల జాబితా
గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఏ స్థానం ఎవరికి రిజర్వు చేయాలనే
అంశంపై సంబంధిత అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేస్తోంది. ఆయా స్థానాల రిజర్వేషన్ల జాబితాలను రూపొందించి పంపాలని ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగానికి పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో సోమవారం కలెక్టరేట్‌లో ఆయా ఆర్డీఓలు, జెడ్పీ సీఈఓ, డీపీఓ, ఎంపీడీఓ, ఎంపీఓలు ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వస్తుండటంతో ఆశావహుల్లో
ఉత్కంఠ పెరుగుతోంది. – సాక్షి, సిద్దిపేట
జిల్లాలో 26 జెడ్పీటీసీ స్థానాలు, 230 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అలాగే ఎంపీపీ స్థానాలు 26 ఉన్నాయి. ఈ స్థానాలు ఏ సామాజి కవర్గానికి రిజర్వు చేయాలనే అంశంపై కసరత్తు కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే డాటా ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కేటాయిస్తున్నా రు. డాటాను ప్రభుత్వం నుంచే జిల్లాకు పంపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో బీసీలకు దాదాపు పది జెడ్పీటీసీలు, 96 ఎంపీటీసీలు కేటాయించే అవకాశం ఉంది.
బీసీలకు 213 సర్పంచ్ స్థానాలు?
జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే 213 గ్రామ పంచాయతీలు బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. అయితే ఏ గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వు అవుతాయి? ఎస్సీ సామాజిక వర్గాలకు రిజర్వు అయ్యే పంచాయతీలు ఏవీ? ఎస్టీలకు కేటాయించే పంచాయతీలు ఏవీ? అనే అంశంపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. మహిళా రిజర్వేషన్ల ఖరారుకు లాటరీ పద్ధతి ద్వారా చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఆయా రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ప్రక్రియను చేపట్టనున్నారు.
నేడు రిజర్వేషన్ల జాబితా?
ఆయా స్థానిక సంస్థల స్థానాల రిజర్వేషన్లను ఖరారు చేసి.. సంబంధిత జాబితాలను మంగళవారం పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు పంపనున్నట్లు సమాచారం. ఈ రిజర్వేషన్ల పై ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల సూచనల ప్రకారం ఈ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఆయా ఎంపీడీఓలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఆర్డీఓలు ఖరారు చేయనున్నారు. జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లు అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు), జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్‌ను పంచాయతీ కమిషనర్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
రిజర్వేషన్లపై ఉత్కంఠ!