
సమన్వయ లోపమే కారణం
అండర్‌పాస్‌లు, బ్రిడ్జిల నిర్మాణం లేకుండానే పూర్తయిన పనులు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు శాశ్వత పరిష్కారానికి అడుగులు పడేనా? గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో తప్పని వరద పాట్లు
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ప్రధాన రోడ్డు ఆధునీకరణకు పదేళ్ల క్రితం అప్పటి సీఎం కేసీఆర్ హయాంలో సుమారు రూ.45కోట్ల వరకు వెచ్చించారు. ప్రజ్ఞాపూర్ చౌరస్తా నుంచి గజ్వేల్‌లోని తూప్రాన్ రోడ్డు వైపున 133/33కేవీ సబ్‌స్టేషన్ వరకు 5కిలోమీటర్ల మేర పనులు సాగాయి. 100మీటర్ల విస్తరణతో డివైడర్లు, బట్టర్‌ఫ్లై లైట్లు, ఫుట్‌పాత్‌లతో అందంగా తీర్చిదిద్దారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో వివిధ రకాల మొక్కలను నాటి మరింత శోభను తీసుకొచ్చారు. పదేళ్ల క్రితమే పనులు పూర్తికాగా, అయిదేళ్ల క్రితం నేషనల్ హైవే అథారిటీకి అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ రోడ్డుపై పలు చోట్ల అండర్‌పాస్‌లు, బ్రిడ్జిలను నిర్మించాల్సి ఉండగా.. వాటిని డిజైన్‌లో మరిచిపోయారు. ఫలితంగా ఈ రోడ్డుకు ఏటా వరద ముప్పు తప్పడం లేదు.
ఆక్రమణలో నాలాలు
ప్రధానంగా ప్రజ్ఞాపూర్ ఊర చెరువు మత్తడి దూకితే...ఆ నీరు వెళ్లడానికి అవసరమైన నాలాల వ్యవస్థ లేదు. నాలాలన్నీ ఆక్రమణకు గురయ్యాయి. నిజానికి ఈ వరద నీరు నాలాల ద్వారా రాజిరెడ్డిపల్లి కుంటలోకి అక్కడి నుంచి క్యాసారం కుంటలోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ నీరు వెళ్లే మార్గం లేక అక్కడి నుంచి ఇళ్ల మధ్య నుంచే వరద నీరు కొట్టుకు వస్తోంది. ఇదే నీరు పార్ధివేశ్వరస్వామి ఆలయం ఆర్చి వద్ద రోడ్డుపైకి వచ్చి జలమయంగా మారుతోంది. దీనివల్ల రోజుల తరబడి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.
తరచూ జలదిగ్బంధంలో ప్రధాన రహదారి
సమస్య పరిష్కారానికి ప్రధాన రహదారి కింది భాగంలో అండర్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉండగా.. దానిని మరిచిపోయారు. నీటిపారుదల శాఖ, మున్సిపల్, ఆర్‌అండ్‌బీ శాఖలు సమన్వయంతో ఈ సమస్యపై గతంలో స్పందించి ఉంటే.. కొంతమేరకు నాలాల వ్యవస్థను సరిచేసే అవకాశం ఉండేది. ప్రధాన రోడ్డుపైకి వరద పొంగి పొర్లే పార్ధివేశ్వర కమాన్ వద్ద, తూప్రాన్ రోడ్డు వైపున బ్రిడ్జిలు లేదా అండర్ పాస్‌ల నిర్మాణం జరిగి ఉండాల్సింది. ఇందుకోసం రూ.12కోట్లతో ప్రతిపాదనలు పెట్టారు. కానీ ఆమోదం లభించలేదు. అదేవిధంగా ఎర్రకుంట నుంచి పాండవుల చెరువు ఫీడర్ ఛానెల్ నిర్మాణానికి మరో రూ.2 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. కానీ ఈ ప్రతిపాదన లకు మోక్షం కరువైంది. ప్రస్తుతం ఈ సమస్య పట్టణంలో హాట్‌టాపిక్‌గా మారింది. రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారి తీస్తున్నది. ఇప్పటికై నా శాశ్వత పరిష్కారం లభించేనా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.