
ధాన్యం కొనుగోలుకు సమగ్ర ప్రణాళిక
● జిల్లా లక్ష్యం 5.03లక్షల మెట్రిక్ టన్నులు ● రైతులకు ఇబ్బందులు కలుగొద్దు ● అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
సిద్దిపేటజోన్: వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికలతో యంత్రాంగం ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. వరి ధాన్యం కొనుగోళ్లు–మద్దతు ధర తదితర అంశాలపై శనివారం స్థానిక విపంచి ఆడిటోరియంలో వానాకాలం 2025–26 కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలకు లోబడి ధాన్యం తెచ్చిన రైతులకు ప్రభుత్వ మద్దతు ధర అందేలా చూడాలని పేర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో సుమారు 3,29 లక్షల ఎకరాల్లో వరి సాగు అయిందని, మొత్తంగా 8.28లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యే అవకాశం ఉందన్నారు. ఇందులో రైతుల అవసరాలు, ఇతరత్రా బహిరంగ కొనుగోళ్లకు పోను 5.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిధిలో సన్న, దొడ్డు ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏ గ్రేడ్ రకం మద్దతు ధర క్వింటాలుకు రూ 2,389, సాధారణ రకం క్వింటాలుకు రూ 2,369 ప్రభుత్వం ధర నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 439 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కొనుగోలు కేంద్రంలో ప్యాడి క్లినర్, వేయింగ్ స్కెల్, తేమ పరీక్ష మిషన్, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జిల్లాలో పెద్ద కొనుగోలు కేంద్రాలకు ఆటోమేటిక్ ప్యాడి క్లినర్లను ఇస్తామన్నారు. ప్రభుత్వ బోనస్ రూ 500అదనంగా చెల్లింపు ఉంటుందన్నారు. నిర్దేశించిన లక్ష్యం ధాన్యం సేకరణకు అవసరమైన గన్ని బ్యాగ్‌లను సమకూర్చుకోవాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో సరిపడా హమాలీలు ఉండేలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎస్‌ఓ తనూజ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, డిఎం సివిల్ సప్లై,, ఆయా మండల వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు, మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.