విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధికి కృషి
● విదేశీ ప్రతినిధుల బృందం స్పష్టీకరణ ● మరోవైపు ఉమ్మడి జిల్లా స్థాయి ఆటల పోటీలు ప్రారంభం ● సందడిగా వర్గల్ పూలే గురుకులం
వర్గల్(గజ్వేల్): స్థానిక జ్యోతిబాపూలే గురుకులం రెండు వేర్వేరు కార్యక్రమాలతో సందడిగా మారింది. ఒకే ప్రాంగణంలోని మహిళా డిగ్రీ కళాశాలను గురువారం కాగ్నిజెంట్ సంస్థ ప్రతినిధులు సందర్శించగా, జూనియర్ కళాశాలలో అండర్–17 ఉమ్మడి జిల్లాస్థాయి ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి. ఆటల పోటీలను పూలే గురుకులాల జాయింట్ సెక్రటరీ శ్యాంప్రసాద్‌లాల్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రిన్సిపాల్ లక్ష్మీదేవి, ఆర్సీఓ రాజేశంతో కలిసి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు.
డిగ్రీ కళాశాలలో
కాగ్నిజెంట్ సంస్థ ప్రతినిధులు
మహిళా డిగ్రీ కళాశాలను కాగ్నిజెంట్ విదేశీ కంపెనీ ప్రతినిధులు మైఖేల్, రూట్టలెడ్జి, సుసన్, మౌనిక, కారోల్ భోరాసకి,థామస్ జోన్స్, వైవీట్టే వర్గాస్, కోటగిరి మురళి, శ్రీరామ్ రంగమణి, నేహా రీచార్య, బిభాస్ రాయ్, అనురాధ, లావణ్య తదితరులు సందర్శించారు. ప్రయోగశాలను సందర్శించి విద్యార్థుల ప్రయోగాత్మక పరిజ్ఞానాన్ని అభినందించారు. గురుకులంలో విద్యార్థుల కోసం అవసరమైన ప్రయోగశాల సామగ్రి, కంప్యూటర్లను అందజేస్తామన్నారు. విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. విదేశీ ప్రతినిధులకు ప్రిన్సిపాల్ భాస్కర్‌రావు ఆధ్వర్యంలో విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గురుకులాల జాయింట్ సెక్రటరీ శ్యాంప్రసాద్ లాల్ హాజరుకాగా, ఆర్సీఓ రాజేశం, వీపీ గోవిందరావు, అధ్యాపకులు రాధ, జయ తదితరులు పాల్గొన్నారు.


