బాబర్ ఆజం
పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై విమర్శల పర్వం కొనసాగుతోంది. టీ20 ప్రపంచకప్-2024లో బాబర్ ఆజం బృందం చెత్త ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే.
అమెరికా, టీమిండియా చేతిలో ఓడిన పాకిస్తాన్.. లీగ్ దశలోనే నిష్క్రమించింది. గత ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచిన పాక్.. ఈసారి కనీసం సూపర్-8కు కూడా అర్హత సాధించలేకపోయింది.
ఈ నేపథ్యంలో బాబర్ బృందం ఆట తీరుపై పాక్ మాజీ క్రికెటర్లు విరుచుకుపడుతున్నారు. ఏ దశలోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయారని.. గ్రూపు రాజకీయాలతో జట్టును నాశనం చేశారంటూ మండిపడుతున్నారు.
ఇక టోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత కెప్టెన్ బాబర్ ఆజం సహా ఆజం ఖాన్, హ్యారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్, మహ్మద్ అమీర్, ఇమాద్ వసీం తదితరులు పాకిస్తాన్‌కు వెళ్లకుండా.. యూకేకి వెళ్లినట్లు సమాచారం. హాలిడే ట్రిప్ కోసం వీళ్లంతా కుటుంబాలతో కలిసి లండన్ వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొందరు అమెరికాలోనే ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే ఐసీసీ ఈవెంట్‌లో పరాభవానికి తోడు.. ఆటగాళ్లు ఇలా హాలిడే ట్రిప్‌నకు వెళ్లడంతో మాజీ ఆగ్రహం నషాళానికి అంటింది. ఈ నేపథ్యంలో మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ అతీక్ ఉజ్ జమాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
‘‘మీరంతా ఎందుకింత డ్రామా చేస్తున్నారు. మేము క్రికెట్ ఆడే రోజుల్లో.. ఒక కోచ్.. అతడితో పాటు మేనేజర్ ఉండేవాడు. వాళ్లే టీమ్‌ను చూసుకునే వారు.
కానీ ఇప్పుడు 17 మంది ఆటగాళ్లు.. వాళ్లకు తోడు 17 మంది అధికారులు.. మీ అందరి కోసం 60 గదులు బుక్ చేయాలి. ఏంటీ తమాషాగా ఉందా? మీరక్కడికి క్రికెట్ ఆడేందుకు వెళ్లారా? లేదంటే హాలిడే కోసం వెళ్లారా?
అయినా.. వరల్డ్‌కప్ లాంటి కీలక ఈవెంట్లకు మీతో పాటు కుటుంబాలను కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమిటి? మ్యాచ్‌లు ఉన్న సమయంలో భార్యలతో కలిసి టూర్లకు వెళ్లడం బాగా అలవాటైపోయింది.
భార్య, పిల్లలు, కుటుంబం.. అంతా మీతో ఉన్నపుడు ఆట మీద శ్రద్ధ పెట్టగలరా? బయటకు వెళ్లడం ఫుడ్ తినడం, ఫొటోలు, వీడియోలు తీసుకోవడం ఇదేపని.
అసలు ఇలాంటి సంస్కృతి పాక్ జట్టులో ఉండేదే కాదు. మరీ ఇంత క్రమశిక్షణా రాహిత్యమా? ఒక్కరు కూడా శ్రద్ధగా ఆడుతున్నట్లే కనిపించడం లేదు. ప్రతీ ఏడాది కోట్లకు కోట్లు ఫీజులు మాత్రం తీసుకుంటారు’’ అని అతీక్ ఉజ్ జమాన్ మండిపడ్డాడు. కాగా అతీక్ పాకిస్తాన్ తరఫున ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment