ఐపీఎల్‌కు ముందే స్టార్ట్‌ అయిన అభిషేక్‌ విధ్వంసం.. సిక్సర్ల దెబ్బకు అద్దాలు ధ్వంసం | Abhishek Sharma Shatters Glass Pane In SRH Training Ahead Of IPL 2025, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌కు ముందే స్టార్ట్‌ అయిన అభిషేక్‌ విధ్వంసం.. సిక్సర్ల దెబ్బకు అద్దాలు ధ్వంసం

Published Thu, Mar 20 2025 1:59 PM | Last Updated on Thu, Mar 20 2025 3:10 PM

Abhishek Sharma Shatters Glass Pane In SRH Training Ahead Of IPL 2025

ఐపీఎల్‌ 2025 ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ షో మొదలైంది. ప్రాక్టీస్‌ సెషన్స్‌లో, ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌ల్లో శర్మ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. నిన్నటి ప్రాక్టీస్‌ సందర్భంగా శర్మ కొట్టిన ఓ బంతి అగ్నిమాపక పరికరం అద్దాలు ధ్వంసం చేసింది. సన్‌రైజర్స్‌ విడుదల చేసిన ఓ వీడియోలో శర్మ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. సిక్సర్లు బాదే క్రమంలో చాలా బ్యాట్లు కూడా విరిగిపోయాయని చెప్పుకొచ్చాడు. 

ఈ వీడియోతో సన్‌రైజర్స్‌ ప్రత్యర్థులను బయపెట్టే పనిలో పడింది. అభిషేక్‌ శర్మతో జాగ్రత్తగా ఉండాలని సంకేతాలు పంపింది. గత సీజన్‌లో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉండిన అభిషేక్‌.. సహచర ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌తో కలిసి సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడాడు. సన్‌రైజర్స్‌ సాధించిన అతి భారీ స్కోర్లలో అభిషేక్‌ పాత్ర కీలకం. 

అభిషేక్‌ గత సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడి 204.22 స్ట్రయిక్‌రేట్‌తో 484 పరుగులు చేశాడు. ఇందులో 36 బౌండరీలు, 42 సిక్సర్లు ఉన్నాయి. గత సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదింది కూడా అభిషేకే. అభిషేక్‌ గత సీజన్‌లోలాగే ఈ సీజన్‌లోనూ పేట్రేగిపోయే అవకాశం ఉంది. 

గత ఐపీఎల్‌ తర్వాత అతను మరింత రాటు దేలాడు. టీమిండియాకు ఎంపికై అంతర్జాతీయ వేదికపై కూడా సత్తా చాటాడు. ఆ అనుభవంతో అభిషేక్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సునామీలా విరుచుకుపడవచ్చు. అభిషేక్‌తో పాటు సహచరులు ట్రవిస్‌ హెడ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, ఇషాన్‌ కిషన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి కూడా విజృంభిస్తే.. గత సీజన్‌లో మిస్సైన టైటిల్‌ను సన్‌రైజర్స్‌ ఈ సీజన్‌లో సాధించవచ్చు. 

పై పేర్కొన్న బ్యాటర్లు తమ సహజ ఆటతీరును ప్రదర్శిస్తే ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ 300 పరుగుల మార్కును దాటేస్తుంది. ప్రాక్టీస్‌ సందర్భంగా సన్‌రైజర్స్‌ బ్యాటర్లు ఇదే టార్గెట్‌ పెట్టుకుని భారీ షాట్లు ఆడుతూ కనిపించారు. ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌ల్లో ఆరెంజ్‌ ఆర్మీలోకి కొత్తగా చేరిన ఇషాన్‌ కిషన్‌ విశ్వరూపం ‍ప్రదర్శిస్తున్నాడు. 

అభిషేక్‌ జోరుకు ఇషాన్‌ విధ్వంసం కూడా తోడైతే సన్‌రైజర్స్‌కు ఈ సీజన్‌లో పట్టపగ్గాలు ఉండవు. గత సీజన్‌లో బ్యాటర్లు చెలరేగడంతో సన్‌రైజర్స్‌ ఆర్సీబీపై 287 (ఐపీఎల్‌ హిస్టరీలో ఇదే అత్యధిక స్కోర్‌), ముంబై ఇండియన్స్‌పై 277, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 266 పరుగులు చేసింది. గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ మరింత ప్రమాదకరంగా కనిపిస్తుంది.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ బలంగా ఉంది. భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్‌ లాంటి దేశీయ పేసర్లు దూరమైనా షమీ, ఉనద్కత్‌, హర్షల్‌ పటేల్‌ కొత్తగా జట్టులో చేరారు. స్పిన్‌ విభాగంలోనూ సన్‌రైజర్స్‌ పటిష్టంగా కనిపిస్తుంది. ఆసీస్‌ స్టార్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాను సన్‌రైజర్స్‌ ఈ సీజన్‌లో అక్కున చేర్చుకుంది. లోకల్‌ స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ తనదైన రోజున అద్భుతాలు చేయగలడు. 

పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్లు అభిషేక్‌ శర్మ, ట్రవిస్‌ హెడ్‌, కమిందు మెండిస్‌ ఫుల్‌టైమ్‌ స్పిన్నర్లకు ఏమాత్రం తీసిపోరు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న సన్‌రైజర్స్‌ ఈ సీజన్‌లో టైటిల్‌ గెలుస్తుందేమో చూడాలి.

కాగా, ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ ప్రయాణం మార్చి 23న రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ మ్యాచ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ హోం గ్రౌండ్‌ ఉప్పల్‌ స్టేడియంలో జరుగనుంది. ఈ ఏడాది ఐపీఎల్‌ మార్చి 22న ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కేకేఆర్‌.. ఆర్సీబీతో తలపడనుంది.

2025 ఐపీఎల్‌ కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఇదే..
పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), అథర్వ్‌ తైడే, అభినవ్‌ మనోహర్‌, అనికేత్‌ వర్మ, సచిన్‌ బేబి, ట్రవిస్‌ హెడ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, కమిందు మెండిస్‌, వియాన్‌ ముల్దర్‌, అభిషేక్‌ శర్మ, హెన్రిచ్‌ క్లాసెన్‌, ఇషాన్‌ కిషన్‌, జీషన్‌ అన్సారీ, మహ్మద్‌ షమీ, హర్షల్‌ పటేల్‌, రాహుల్‌ చాహర్‌, సిమర్‌జీత్‌ సింగ్‌, ఎషాన్‌ మలింగ, ఆడమ్‌ జంపా, జయదేవ్‌ ఉనద్కత్‌

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement