
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami)కి అతడి చిన్ననాటి కోచ్ బదరుద్దీన్ సిద్దిఖీ(Badaruddin Siddiqui) అండగా నిలిచాడు. షమీ సరైన దారిలోనే వెళ్తున్నాడని.. అన్నింటి కంటే దేశమే ముఖ్యమని అతడికి తెలుసునని వ్యాఖ్యానించాడు. భారత్ కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతున్న వేళ షమీ ఏకాగ్రత దెబ్బతినేలా ఎవరూ మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశాడు.
కాగా ఆల్ ఇండియా ముస్లి జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వి షమీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవిత్ర రంజాన్ మాసంలో ‘రోజా’(Roza) పాటించకుండా షమీ పెద్ద నేరం చేశాడని ఆయన ఆరోపించారు.
అతడు ఇలాంటి తప్పు చేయకుండా ఉండాల్సిందని.. షరియత్ (చట్టం) దృష్టిలో అతడొక పెద్ద నేరగాడని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో అతడు దేవుడికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అత్యంత ముఖ్య విధి.. అతడో నేరగాడు
‘రోజా’లో ఉపవాసం పాటించడమే అత్యంత ముఖ్య విధి అని.. కానీ దానిని విస్మరించడం మహిళలకైనా, పురుషులకైనా మంచిదికాదని షహబుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియా ప్రఖ్యాత క్రికెటర్ అయి ఉండి.. మ్యాచ్ మధ్యలో నీళ్లు లేదంటే వేరే ఏదో డ్రింక్ తాగడం సరికాదని విమర్శించారు.
ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు మౌలానా ఖలీద్ రషీద్ ఫరాంగి మాహిల్ మాత్రం షమీకి అండగా నిలిచారు. రోజా పాటించాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయమని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరు రోజా పాటించాలని ఖురాన్‌లో ఉందని.. అయితే, ప్రయాణాలు చేస్తున్నపుడు కొంతమందికి ఇది సాధ్యం కాదు కాబట్టి మినహాయింపు ఉంటుందని తమ పవిత్ర గ్రంథంలోనే ఉందని తెలిపారు. షమీ తప్పు చేశాడంటూ వేలెత్తి చూపే హక్కు ఎవరికీ లేదని ఖలీద్ స్పష్టం చేశారు.
షమీ చేసినదాంట్లో తప్పేమీ లేదు
ఈ క్రమంలో షమీ టీమిండియా బౌలర్‌గా ఎదగడంలో కీలక పాత్ర పోషించిన చిన్ననాటి కోచ్ బదరుద్దీన్ సిద్ధిఖీ సైతం అతడికి మద్దతు పలికారు. ‘‘షమీ చేసినదాంట్లో తప్పేమీ లేదు. ఇలాంటి విషయాలను అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు.
దేశానికే మొదటి ప్రాధాన్యం
బయట నుంచి వచ్చే విమర్శలను పక్కనపెట్టి.. షమీ ఫైనల్ మ్యాచ్‌పై దృష్టి పెట్టాల్సి ఉంది. అతడు ఎలాంటి నేరమూ చేయలేదు. దేశం కోసం అతడు ఆడుతున్నాడు. వ్యక్తిగత విషయాల కంటే దేశానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సరైంది. షమీ కూడా అదే చేస్తున్నాడు. దయచేసి ఎవరూ కూడా అతడి ఏకాగ్రత దెబ్బతినేలా మాట్లాడవద్దు’’ అని బదరుద్దీన్ విజ్ఞప్తి చేశారు.
చాంపియన్స్ ట్రోఫీతో బిజీ
కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ షమీ ప్రస్తుతం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025తో బిజీగా ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచి భారత్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్.. తదుపరి చీలమండ గాయం వల్ల ఏడాదికి పైగా జట్టుకు దూరమయ్యాడు.
ఇటీవల ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చిన షమీ.. చాంపియన్స్ ట్రోఫీలోనూ రాణిస్తున్నాడు. గ్రూప్ దశతో తొలుత బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లతో చెలరేగిన షమీ.. ఆస్ట్రేలియాతో కీలక సెమీస్ మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. పది ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 48 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
ఇక ఈ మెగా వన్డే టోర్నీలో ఫైనల్‌కు చేరిన టీమిండియా ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో టైటిల్ పోరులో తలపడనుంది. అయితే, ఆసీస్‌తో మ్యాచ్ సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగుతున్న దృశ్యాలు వైరల్ కావడంతో అతడిపై విమర్శలు వచ్చాయి.
చదవండి: IND vs NZ: ఇది సరికాదు!.. టీమిండియాపై కివీస్ గెలవాలి: మిల్లర్
Comments
Please login to add a commentAdd a comment