న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వరల్డ్ నంబర్‌వన్ కార్లోస్ అల్‌కరాజ్ (స్పెయిన్)కు రెండో రౌండ్‌లో సునాయాస విజయం దక్కింది. ఈ మ్యాచ్‌లో టాప్ సీడ్ అల్‌కరాజ్ 6–3, 6–1, 7–6 (7/4)తో లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)ను ఓడించి మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) రెండో రౌండ్‌లో 6–2, 6–2, 6–7 (6/8), 6–2తో క్రిస్టోఫర్ కానెల్ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించాడు.
మూడు గ్రాండ్‌స్లామ్‌ల విజేత ఆండీ ముర్రే (బ్రిటన్) ఆట మాత్రం రెండో రౌండ్‌లోనే ముగిసింది. గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6–3, 6–4, 6–1తో ముర్రేను ఇంటి ముఖం పట్టించాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ సబలెంకా (రష్యా) 6–3, 6–2తో జోడీ బురెజ్ (యూకే)ను...9వ సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–2తో ట్రెవిజాన్ (ఇటలీ)ను ఓడించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు.
టెన్నిస్ సర్క్యూట్‌లో సుదీర్ఘ మ్యాచ్‌లకు చిరునామాగా నిలిచిన జాన్ ఇస్నర్ (అమెరికా) రెండో రౌండ్‌లో మరో సుదీర్ఘ సమరంలో ఓడి ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 3 గంటల 57 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో అమెరికాకే చెందిన మైకేల్ మో 3–6, 4–6, 7–6 (7/3), 6–4, 7–6 (10/7) స్కోరుతో ఇస్నర్‌ను ఓడించాడు. టెన్నిస్ చరిత్రలో సుదీర్ఘ మ్యాచ్ (11 గంటల 5 నిమిషాల పాటు – నికోలస్ మహుత్‌తో) ఆడిన రికార్డులో ఇస్నర్ భాగం కాగా...అత్యధిక ఏస్‌లు (14,470) కొట్టిన ఘనత కూడా అతని సొంతం.
పురుషుల డబుల్స్‌లో ఇద్దరు భారత ఆటగాళ్ల పోరు తొలి రౌండ్‌లోనే ముగిసింది. యూకీ బాంబ్రీ (భారత్) – డెమోలినర్ (బ్రెజిల్) జోడి 3–6, 5–7తో హ్యూగో నిస్ (మొనాకో) – జిలిన్‌స్కీ (పోలాండ్) చేతిలో... సాకేత్ మైనేని (భారత్) – కరట్‌సెవ్ (రష్యా) ద్వయం 7–6 (7/4), 3–6, 2–6తో లాస్లో జెరె (సెర్బియా) – హ్యూస్టర్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడారు.
Comments
Please login to add a commentAdd a comment