ఆసియాకప్-2023కు రంగం సిద్దమైంది. మరికొన్ని గంటల్లో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ముల్తాన్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్-నేపాల్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు మొదలు కానుంది. నేపాల్ జట్టు తొలి సారి ఆసియాకప్‌లో భాగమైంది.
ఇక భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 2న కాండీ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు బుధవారం శ్రీలంకకు పయనం కానుంది. అయితే ఈ జట్టుతో కలిసి స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ మాత్రం లంక వెళ్లడం లేదు.
అతడి గాయం తిరగబెట్టడంతో మరో వారం రోజుల పాటు ఏన్సీఏలోనే ఉండనున్నాడు. దీంతో మెగా ఈవెంట్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. ఇక ఈ ఆసియాకప్‌లో టీమిండియా రికార్డు ఎలా ఉందో ఓ లూక్కేద్దం.
చరిత్ర మనదే...
1984 నుంచి 2022 వరకు 15సార్లు ఆసియా కప్‌ను నిర్వహించారు. 2018లో చివరిసారిగా వన్డే ఫార్మాట్‌లో నిర్వహించగా, నాడు ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి భారత్ విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా భారత్ ఖాతాలో 7 టైటిల్స్ ఉండగా, శ్రీలంక 6 సార్లు ట్రోఫీ గెలుచుకుంది. పాకిస్తాన్ 2 సార్లు విజేతగా నిలిచింది. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఈ ఫార్మాట్‌లో భారత్, పాకిస్తాన్ తలపడటం ఇదే మొదటిసారి కానుంది.
గత ఆసియా కప్ (టి20)లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లలో చెరో మ్యాచ్ గెలిచి సమంగా నిలవగా... వరల్డ్ కప్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో జరిగిన పోరులో కోహ్లి అద్భుత ఆటతో టీమిండియాను గెలిపించాడు. గత కొన్నేళ్లుగా ఆసియా కప్ సమరాలు కూడా ఆసక్తికరంగా మారాయి.
ముఖ్యంగా అఫ్గానిస్తాన్ టీమ్ పురోగతి కారణంగా ఆ జట్టు శ్రీలంకతో, పాక్‌తో, బంగ్లాతో తలపడినప్పుడు ఉద్రిక్తభరిత వాతావరణం ఉంటోంది. అయితే భారత్ మాత్రం సహజంగానే తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఇతర జట్లకంటే ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉంటోంది. టీమిండియా కూడా తమ స్థాయికి తగినట్లుగా ఆడితే మరో టైటిల్ మన ఖాతాలో చేరడం ఖాయం.
చదవండి: Asia Cup 2023: ‘ఆసియా’ పోరుకు రంగం సిద్దం
Comments
Please login to add a commentAdd a comment