టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అమీర్ జంగూను టీ20 జట్టులోకి తీసుకుంది. చంఢీఘడ్ వన్డేలో గాయపడిన యువ బ్యాటర్ జ్యువెల్ ఆండ్రూకు బ్యాకప్‌గా జంగూను ఎంపిక చేశారు.
చండీగఢ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా యువ బ్యాటర్ జ్యువెల్ ఆండ్రూ చేతి వేలికి తీవ్ర గాయమైంది. గాయం కారణంగా అతడు ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు కూడా రాలేకపోయాడు. ఆండ్రూ గాయం తీవ్రత దృష్ట్యా అతడు టీ20 సిరీస్ నుంచి తప్పుకునే అవకాశాలు ఉండడంతో జంగూకు చోటిచ్చారు.
వన్డే సిరీస్‌లో జంగూ విధ్వంసం
టీమిండియాతో వన్డే సిరీస్‌లో జంగూ దుమ్ములేపాడు. ఆడిన 3 ఇన్నింగ్స్‌ల్లో 119.50 సగటుతో, 135.80 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 239 పరుగులు సాధించాడు. తొలి వన్డేలో మెరుపు హాఫ్ సెంచరీ సాధించిన జంగూ.. గువాహటి వన్డేలో అద్భుత సెంచరీతో చెలరేగాడు. చివరి వన్డేలో అర్ధ శతకంతో మెరిశాడు. ఇప్పుడు భీకర ఫామ్‌లో ఉన్న జంగూ టీ20 జట్టులో రావడంతో మరోసారి భారత బౌలర్లకు కఠిన సవాల్ ఎదురుకానుంది.
టీ20 కెరీర్ ట్రాక్ రికార్డ్
2025 సెప్టెంబర్ 27న నేపాల్‌పై అరంగేట్రం చేసిన జంగూ.. ఇప్పటివరకు వెస్టిండీస్ తరఫున 7 టీ20లు ఆడి 163 పరుగులు చేశాడు. మొత్తంగా 34 టీ20 మ్యాచ్‌ల్లో 710 పరుగులు సాధించిన జంగూ.. కరేబియన్ ప్రీమియర్ లీగ్-2026 విజతగా యాంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ నిలవడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. 9 మ్యాచ్‌ల్లో 213 పరుగులు చేసి రాణించాడు. ఇక ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ అక్టోబర్ 6న లక్నో వేదికగా జరగనుంది.
చదవండి: జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా పృథ్వీ షా


