కొన్నేళ్ల క్రితం ‘బిగ్ ఫోర్’లో ఒకడిగా వెలుగొందిన బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే కెరీర్ గాయాల కారణంగా గాడి తప్పింది. ‘గ్రాండ్‌స్లామ్’ విజయాల్లో జొకోవిచ్, నాదల్, ఫెడరర్ దూసుకుపోతుంటే ముర్రే మాత్రం వెనుకబడిపోయాడు. తాను పాల్గొన్న చివరి ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ముర్రే ఒక్కసారి మాత్రమే మూడో రౌండ్ వరకు వెళ్లగలిగాడు. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగిన ముర్రే వరుస సెట్‌లలో తొలి రౌండ్‌లో విజయం అందుకున్నాడు.
న్యూయార్క్: ఈ ఏడాది ఆడుతున్న మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లోనూ బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించాడు. సోమవారం మొదలైన టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో 2016 చాంపియన్ ఆండీ ముర్రే శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 51వ ర్యాంకర్ ముర్రే 7–5, 6–3, 6–3తో ప్రపంచ 27వ ర్యాంకర్, 24వ సీడ్ ఫ్రాన్సిస్కో సెరున్‌డొలో (అర్జెంటీనా)పై గెలుపొంది రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు.
రెండు గంటల 41 నిమిషాలపాటు జరిగిన పోరులో ముర్రే ఆరు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 23 సార్లు దూసుకొచ్చిన ముర్రే 18 సార్లు పాయింట్లు గెలిచాడు. మ్యాచ్ మొత్తంలో ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిది సార్లు బ్రేక్ చేసిన ఈ మాజీ నంబర్‌వన్ తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు. 32 అనవసర తప్పిదాలు చేసిన ముర్రే 25 విన్నర్స్ కొట్టాడు. కెరీర్‌లో 16వసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతున్న ముర్రే 2016లో టైటిల్ సాధించి, 2008లో రన్నరప్‌గా నిలిచాడు.
మెద్వెదెవ్ అలవోక విజయం
పురుషుల సింగిల్స్‌లో తొలిరోజు జరిగిన మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) కూడా అలవోక విజయంతో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. స్టెఫాన్ కొజ్లోవ్ (అమెరికా)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో మెద్వెదెవ్ 6–2, 6–4, 6–0తో గెలుపొందాడు. రెండు గంటల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో మెద్వెదెవ్ 10 ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేశాడు. మరో మ్యాచ్‌లో ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన అమెరికా ప్లేయర్ జేజే వుల్ఫ్ 6–4, 6–4, 6–4తో 16వ సీడ్ రొబెర్టో బాటిస్టా అగుట్ (స్పెయిన్)ను ఓడించాడు.
శ్రమించి నెగ్గిన సాకరి
మహిళల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ మరియా సాకరి (గ్రీస్) రెండో రౌండ్ చేరేందుకు కష్టపడాల్సి వచ్చింది. తాత్యానా మరియా (జర్మనీ)తో జరిగిన తొలి రౌండ్‌లో సాకరి 6–4, 3–6, 6–0తో గెలిచింది. 2 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకరి ఆరు ఏస్‌లు సంధించి, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు, 39 అనవసర తప్పిదాలు చేసింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 17వ సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–2, 6–4తో రఖిమోవా (రష్యా)పై, అలీసన్ రిస్కీ అమృత్‌రాజ్ (అమెరికా) 6–2, 6–4తో ఎలీనా యు (అమెరికా)పై విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment