బకూ (అజర్‌బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్, తమిళనాడు గ్రాండ్‌మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద తమ ప్రత్యర్థులపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అర్జున్ 1.5–0.5తో నిల్స్ గ్రాండెలియస్ (స్వీడన్)పై, ప్రజ్ఞానంద 1.5–0.5తో ఫెరెంక్ బెర్కిస్ (హంగేరి)పై, గుకేశ్ 1.5–0.5తో హావో వాంగ్ (చైనా)పై గెలుపొందారు.
క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో గుకేశ్; ప్రజ్ఞానందతో అర్జున్ తలపడతారు. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్ తొలి గేముల్లో నెగ్గిన అర్జున్, గుకేశ్ ఆదివారం జరిగిన రెండో గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని... ప్రజ్ఞానంద 49 ఎత్తుల్లో గెలుపొంది క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. నిపోమ్‌నిషి (రష్యా)తో జరుగుతున్న మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో గేమ్‌ను కూడా విదిత్ (భారత్) ‘డ్రా’ చేసుకోవడంతో ఇద్దరూ 1–1తో సమఉజ్జీగా ఉన్నారు.
వీరిద్దరి మధ్య నేడు ర్యాపిడ్ ఫార్మాట్‌లో టైబ్రేక్ నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక కూడా నేడు ర్యాపిడ్ ఫార్మాట్‌లో టైబ్రేక్ గేమ్‌లు ఆడనుంది. హారిక–అలెగ్జాండ్రా గోర్యాచ్‌కినా (రష్యా)తో క్వార్టర్ ఫైనల్లో రెండు గేమ్‌లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. దాంతో నేడు టైబ్రేక్ అనివార్యమైంది.
Comments
Please login to add a commentAdd a comment