మేమూ సాధించాం... | Australia equal ODI record with a massive victory over New Zealand | Sakshi
Sakshi News home page

మేమూ సాధించాం...

Published Thu, Oct 8 2020 5:25 AM | Last Updated on Thu, Oct 8 2020 5:25 AM

Australia equal ODI record with a massive victory over New Zealand - Sakshi

బ్రిస్బేన్‌: మరోసారి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు వన్డేల్లో వరుసగా 21వ విజయం నమోదు చేసింది. ఈ క్రమంలో 21 విజయాలతో 2003లో రికీ పాంటింగ్‌ సారథ్యంలోని ఆస్ట్రేలియా పురుషుల జట్టు నెలకొల్పిన ప్రపంచ రికార్డును ఆసీస్‌ మహిళల జట్టు సమం చేసింది. బుధవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో ఆసీస్‌ జటుట 232 పరుగుల ఆధిక్యంతో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. పరుగుల పరంగా న్యూజిలాండ్‌పై ఆసీస్‌కిదే అతిపెద్ద విజయం. 2018 మార్చి 12న భారత్‌తో వడోదరలో జరిగిన మ్యాచ్‌తో మొదలైన ఆసీస్‌ విజయయాత్ర ఇప్పటికీ కొనసాగుతోంది.  

గాయాల కారణంగా కెప్టెన్‌ మెగ్‌ లానింగ్, ఆల్‌రౌండర్‌ ఎలీస్‌ పెర్రీ చివరి మ్యాచ్‌కు దూరమైనా ఆసీస్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 325 పరుగులు సాధించింది. తాత్కాలిక కెప్టెన్‌ రాచెల్‌ హేన్స్‌ (104 బంతుల్లో 96; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), అలీసా హీలీ (87 బంతుల్లో 87; 13 ఫోర్లు, సిక్స్‌) తొలి వికెట్‌కు 144 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక అనాబెల్‌ సదర్లాండ్‌ (35; 2 ఫోర్లు, సిక్స్‌), యాష్లే గార్డనర్‌ (20 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), బెత్‌ మూనీ (19 బంతుల్లో 29 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌), తహ్లియా మెక్‌గ్రాత్‌ (11 బంతుల్లో 29 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) కూడా దూకుడుగా ఆడటంతో ఆసీస్‌ స్కోరు 300 దాటింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో అమెలియా కెర్‌ మూడు, హాలీ హడిలెస్టన్‌ రెండు వికెట్లు తీసుకున్నారు. 326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది. ఆసీస్‌ బౌలర్ల ధాటికి న్యూజిలాండ్‌ 27 ఓవర్లలో 93 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది. ఆమీ సాటర్‌వైట్‌ (49 బంతుల్లో 41; 6 ఫోర్లు), మ్యాడీ గ్రీన్‌ (22 బంతుల్లో 22; 4 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు నమోదు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో మెగాన్‌ షుట్, జెస్సికా జొనాస్సెన్, యాష్లే గార్డనర్, మోలినెక్స్‌ రెండేసి వికెట్లు తీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement