హోరాహోరి పోరులో కివీస్ విజయం
ధర్మశాల:టీ20 ప్రపంచకప్ లో భాగంగా ధర్మశాలలో హెచ్.పి.సి.ఎ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఆసీస్పై కివీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి కివీస్ నిర్ధేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో ఆసీస్ బ్యాట్స్మెన్ తడబడ్డారు. ఆసీస్ టాప్ ఆర్డర్లో ఓపెనర్ ఖ్వాజా( 38 పరుగులు) ఒక్కడే పరవాలేదనిపించాడు. అతని అనంతరం వచ్చిన స్మిత్(6 పరుగులు), వార్నర్(6 పరుగులు) నిరాశపరిచారు.
కీలక సమయంలో దాటిగా ఆడేందుకు ప్రయత్నిచి మ్యాక్స్వెల్(22 పరుగులు), మార్ష్(24 పరుగులు) వికెట్లు సమర్పిచుకోవడంతో ఆసీస్ కష్టాల్లో పడింది. చివర్లో టపటపా వికెట్లు కోల్పోవడంతో 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయిన ఆసీస్ 134 పరుగులు మాత్రమే చేసి 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కివీస్ బౌలర్లు భారత్తో జరిగిన మ్యాచ్లో మాదిరిగానే కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. కివీస్ బౌలర్లలో మెక్ క్లెనగాన్కు 3 వికెట్లు దక్కాయి. అండర్సన్, సాంట్నర్లకు రెండేసి వికెట్లు దక్కాయి.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్లు గప్టిల్ 39(27బంతులు), విలియమ్సన్ 24 (20)లు మందు నుంచే దూకుడుగా ఆడి కివీస్ స్కోరు బోర్డు ను పరుగులు పెట్టించారు. ఈ ఇద్దరు 61 పరుగుల భాగస్వామ్యంతో శుభారంబాన్నిచ్చారు. అనంతరం వీరిద్దరూ వెనువెంటనే ఔటవ్వడంతో రన్ రేట్ ఓక్కసారిగా తగ్గిపోయింది. ఆ తర్వాత వచ్చిన వారిలో ఇలియట్ 27(20 బంతులు) మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 142 పరుగులు చేసింది. మాక్స్ వెల్, ఫాల్కనర్‌లు తలా రెండు వికెట్లు తీయగా, వాట్సన్, మార్ష్‌లకు చెరో వికెట్ లభించింది.
ఈ విజయంతో గ్రూప్ బీ పాయింట్ల పట్టికలో మొత్తం నాలుగు పాయింట్లతో న్యూజిలాండ్ ముందంజలో ఉంది.