కివీలకీ,కంగారూలకీ...అస్సలు పడదంట! | World Cup 2015: Facts about Australia vs New Zealand final | Sakshi
Sakshi News home page

కివీలకీ,కంగారూలకీ...అస్సలు పడదంట!

Published Fri, Mar 27 2015 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 11:28 PM

కివీలకీ,కంగారూలకీ...అస్సలు పడదంట!

కివీలకీ,కంగారూలకీ...అస్సలు పడదంట!

చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం. ఊళ్లో అందరితో మంచిగా ఉండే వ్యక్తి... పక్కింటోడితో పొద్దస్తమానం గొడవ పడుతుంటాడు. క్రికెట్‌లోనూ ఇది బాగా కనిపిస్తుంది. భారత్, పాకిస్తాన్ పొరుగు దేశాలే అయినా క్రికెట్ శత్రుత్వం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా ఉప్పూ నిప్పే. ఎవరితో ఓడినా ఫర్వాలేదు కానీ ఆసీస్‌తో ఓడొద్దు... అనేది కివీ అభిమానుల భావన. అలాంటి గొప్ప క్రికెట్ శత్రుత్వంలో అతి పెద్ద పోరాటం ఈసారి జరగబోతోంది. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ఈ రెండు జట్ల మధ్య జరగబోతున్న ఫైనల్‌కీ ‘హీట్’ పెరిగింది.
 
బాగా జాగ్రత్తగా గమనిస్తే తప్ప ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాలలో తేడాలను గుర్తుపట్టలేం. ఆ రెండు జెండాలు దాదాపుగా ఒకేలా కనిపిస్తాయి. ఈ రెండు దేశాలు పక్కపక్కనే ఉంటాయి. రెండింటినీ టాస్మేనియా సముద్రం విడదీస్తుంది. నిజానికి రెండు దేశాల మధ్య బాగానే స్నేహం ఉంటుంది. కానీ క్రికెట్‌కు వచ్చేసరికి మాత్రం రెండు దేశాలు ఉప్పూ నిప్పులా  ఉంటాయి. కావలసినంత స్లెడ్జింగ్ ఉంటుంది. దీనికి కారణం ఉంది. నిజానికి స్నేహంగా ఉండే ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ శత్రుత్వాన్ని తెచ్చిన ఘనత గ్రెగ్ చాపెల్‌ది. భారత జట్టు కోచ్‌గా కావలసినన్ని వివాదాలు సృష్టించిన చాపెల్ ఆటగాడిగా ఉన్న రోజుల్లో చేసిన ఘనకార్యం ఈ రెండు దేశాల మధ్య ‘వేడి’ని పెంచింది. ఇది ఎలా మొదలైందో తెలుసుకోవాలంటే మనం ఒకసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాలి.

1981లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్ ముక్కోణపు వన్డే టోర్నీ ఆడాయి. ఆసీస్, కివీస్ ఫైనల్‌కు వచ్చాయి. తొలి ఫైనల్లో కివీస్, రెండో మ్యాచ్‌లో ఆసీస్ గెలిచాయి. ఇక కీలకమైన మూడో ఫైనల్ మెల్‌బోర్న్ మైదానంలో జరిగింది. న్యూజిలాండ్ గెలవడానికి చివరి బంతికి ఏడు పరుగులు కావాలి. సిక్స్ కొడితే టై అవుతుంది. ట్రెవర్ చాపెల్ బౌలర్. ఆసీస్ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ తన తమ్ముడు ట్రెవర్ దగ్గరికి వచ్చి బంతిని నేల మీద దొర్లిస్లూ (అండర్ ఆర్మ్) వేయమన్నాడు. దీనివల్ల ఎట్టి పరిస్థితుల్లో సిక్స్ కొట్టలేరు. ఆసీస్ గెలుస్తుంది. అన్న చెప్పిన మాటను తమ్ముడు ఆచరణలో పెట్టాడు. బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ క్రికెటర్ మెక్‌కెచీన్ బ్యాట్‌ను విసిరేసి తన నిరసన తెలిపాడు. ఈ ఘటనపై క్రికెట్ ప్రపంచం మండిపడింది. న్యూజిలాండ్ ప్రధానితో సహా ఆ దేశ అభిమానులు ఆసీస్‌పై తిట్ల వర్షం కురిపించారు. క్రీడాస్ఫూర్తి లేని క్రికెటర్లుగా చాపెల్ సోదరులు చరిత్రలో మిగిలారు.   - సాక్షి క్రీడావిభాగం
 
 ప్రపంచకప్ మధ్యలో మరో ట్రోఫీ

ప్రపంచకప్ అంటేనే అన్ని జట్లకూ అదో ప్రతిష్ట. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు మాత్రం ప్రపంచకప్‌తో పాటు మరో ట్రోఫీ కూడా ఇదే సమయంలో ప్రతిష్టగా మారింది. ఈ రెండు దేశాల మధ్య జరిగే వన్డే సిరీస్ విజేతకు చాపెల్-హ్యాడ్లీ ట్రోఫీ ఇస్తారు. 2004 నుంచి మొదలైన ఈ సిరీస్‌లు బిజీ షెడ్యూల్ వల్ల ఇటీవల తరచుగా జరగడం లేదు. దీంతో 2011 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లో విజేతకు ఈ ట్రోఫీ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ నాలుగేళ్ల పాటు ఇరు జట్ల మధ్య వన్డేలు జరగలేదు. దీంతో ఈసారి ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ట్రోఫీ ఇవ్వాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 28న ఆక్లాండ్‌లో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో కివీస్ ఉత్కంఠభరిత పోరులో వికెట్ తేడాతో ఆసీస్‌ను ఓడించి ట్రోఫీని గెలిచింది.
 
పెరిగిన వేడి

ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అభిమానుల మధ్య సోషల్ మీడియా ద్వారా పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. మెల్‌బోర్న్ మైదానం కూడా ఫైనల్‌కు కిక్కిరిసే అవకాశం ఉంది. న్యూజిలాండ్ అభిమానులు కూడా భారీ సంఖ్యలో మెల్‌బోర్న్ చేరుతున్నారు. ప్రపంచకప్ ప్రారంభోత్సవానికి కూడా రాని ఆసీస్ ప్రధాని... న్యూజిలాండ్‌తో లీగ్ మ్యాచ్ కోసం ఏకంగా ఆక్లాండ్ వెళ్లారు. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్‌ను అక్కడి వాళ్లు ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారో చెప్పడానికి ఇది చాలు.
 
హేడెన్‌కు ‘ట్వీట్’ షాక్

ఫైనల్‌కు ముందు ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్‌కు న్యూజిలాండ్ అభిమానుల నుంచి షాక్ తగిలింది. ‘ఆరేళ్లుగా న్యూజిలాండ్ జట్టు మెల్‌బోర్న్‌లో ఆడలేదు. ఈసారి ప్రపంచకప్‌లో వాళ్లు అన్నీ చిన్న చిన్న మైదానాల్లో ఆడారు. మెల్‌బోర్న్‌లో ఎక్కడ ఫీల్డర్‌ను ఉంచాలో కూడా వాళ్లకు తెలీదు’ అని హేడెన్ ట్వీట్ చేశారు. దీనిపై కివీస్ అభిమానులు నిప్పులు చెరిగారు. ‘స్ట్రీకర్స్ సగం దూరం వెళ్లాక నీళ్లు తాగాలా’... ‘ఒకవైపు నుంచి రెండోవైపు వెళ్లేలోపు డేవిడ్ బూన్ 52 బీర్లు తాగుతాడేమో’... ఇలా మెల్‌బోర్న్ మైదానం సైజు గురించి కివీస్ ఫ్యాన్స్ హేళనగా హేడెన్‌కు ట్వీట్స్‌లో సమాధానం ఇచ్చారు. దీంతో ఈ మాజీ క్రికెటర్‌కు షాక్ తగిలినట్లయింది.
 
ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడటం అనేది క్రీడను కెరీర్‌గా ఎంచుకునే ప్రతి న్యూజిలాండ్ క్రీడాకారుడి కల. మా పెద్దన్నయ్య మీద గెలవాలని జట్టులో ప్రతి క్రికెటర్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.          - సౌతీ (న్యూజిలాండ్ బౌలర్)
 
మెల్‌బోర్న్ మైదానంపై మాకున్న అవగాహనే ఫైనల్‌కు మా బలం. న్యూజిలాండ్ క్రికెటర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆక్లాండ్ మ్యాచ్‌లో వాళ్ల చేతిలో ఓటమి తర్వాత మా జట్టులో కసి పెరిగింది. దానివల్ల మా ఆటతీరు మరింత మెరుగుపడింది.
               - క్లార్క్ (ఆసీస్ కెప్టెన్)
 
1878వ సంవత్సరం నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల  మధ్య క్రికెట్ జరుగుతోంది.
    1945-46 సీజన్ నుంచి అధికారిక మ్యాచ్‌లు జరుగుతున్నాయి.
    ఈ రెండు దేశాల మధ్య ట్రాన్స్ టాస్మాన్ ట్రోఫీ కోసం టెస్టు సిరీస్‌లు, చాపెల్ హ్యాడ్లీ ట్రోఫీ కోసం వన్డేలు జరుగుతాయి.
   క్రికెట్ తో పాటు రగ్బీలోనూ ఈ రెండు దేశాల మధ్య ప్రతిసారీ హోరాహోరీ పోరు జరుగుతుంది.
    సాధారణంగా క్రికెట్‌లో ఆసీస్, రగ్బీలో న్యూజిలాండ్‌ది పైచేయిగా కనిపిస్తూ ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement