ఆ్రస్టేలియాతో మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయలక్ష్యం 389... ఇంత భారీ స్కోరు చూడగానే సాధారణంగా ఛేదన చేసే జట్టు మానసికంగా ముందే ఓటమికి సిద్ధమవుతుంది. కానీ న్యూజిలాండ్ తలవంచకుండా చివరి వరకు పోరాడింది... ఒక వైపు వికెట్లు పడుతున్నా, మరో వైపు జోరు తగ్గించలేదు. చివరకు ఆఖరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సిన స్థితి వరకు మ్యాచ్‌ను తీసుకొచ్చింది.
ఇక్కడా అవకాశం ఉన్నా... ఆ్రస్టేలియా అద్భుత ఫీల్డింగ్‌తో కివీస్‌ను నిలువరించడంలో సఫలమైంది. బౌండరీని దాటగలిగే రెండు బంతులను మెరుపు వేగంతో దూసుకెళ్లి ఆపడంతో పాటు రెండో పరుగు కోసం చేసిన ప్రయత్నాన్ని రనౌట్‌తో పడగొట్టింది! దాంతో ఆఖరికి 5 పరుగుల తేడాతో గెలిచి ఆ్రస్టేలియా ఊపిరి పీల్చుకుంది. రచిన్, నీషమ్‌ల పోరాటం చివరకు వృథా అయింది.
అంతకు ముందు తన తొలి ప్రపంచకప్ మ్యాచ్‌లో హెడ్ మెరుపు సెంచరీ, వార్నర్ దూకుడు వెరసి ఆసీస్‌కు భారీ స్కోరును అందించాయి. వరల్డ్ కప్‌లో వరుసగా రెండో రోజు అభిమానులకు ఉత్కంఠభరితమైన మ్యాచ్ చూసే అవకాశం దక్కగా... ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి చేసిన 771 పరుగులు ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక మొత్తం కావడం విశేషం.
ధర్మశాల: మ్యాచ్ మ్యాచ్‌కూ మరింత పదునెక్కుతున్న ఆ్రస్టేలియా ప్రపంచకప్‌లో మరో కీలక విజయాన్ని అందుకుంది. ఐదు సార్లు విజేత అయిన ఆసీస్‌కు ఈ టోర్నీలో ఇది వరుసగా నాలుగో విజయం కాగా, వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఆ జట్టు 350 పరుగుల స్కోరు దాటగలిగింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ 5 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్స్‌లు) వన్డేల్లో నాలుగో శతకం సాధించగా, డేవిడ్ వార్నర్ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) వరుసగా మూడో సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 115 బంతుల్లోనే 175 పరుగులు జోడించడం విశేషం.
అనంతరం న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 383 పరుగులు సాధించింది. రచిన్ రవీంద్ర (89 బంతుల్లో 116; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) టోర్నీ రెండో సెంచరీ సాధించగా... జేమ్స్ నీషమ్ (39 బంతుల్లో 58; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), డరైల్ మిచెల్ (51 బంతుల్లో 54; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
వరల్డ్ కప్ కోసం ఆసీస్ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ట్రవిస్ హెడ్ ఉన్నాడు. అయితే అనూహ్యంగా అతని చేతికి గాయమైంది. అయినా సరే అతని స్థానంలో మరొకరిని తీసుకోకుండా 14 మందితోనే ఆసీస్ జట్టును కొనసాగించింది. తొలి ఐదు మ్యాచ్‌లకు దూరమైన అతను తనపై ఉంచి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వచ్చీ రాగానే తన విలువేంటో చూపించాడు.
హెడ్, వార్నర్ కలిసి కివీస్ బౌలర్లపై విరుచుకుపడటంతో తొలి 10 ఓవర్లలోనే ఆసీస్ ఏకంగా 118 పరుగులు చేసింది. ఈ క్రమంలో వార్నర్ 28 బంతుల్లో, హెడ్ 25 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 19 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోరు 175/0 కాగా, ఈ స్కోరు వద్ద జోడీని విడదీయడంలో కివీస్ సఫలమైంది. అనంతరం 59 బంతుల్లోనే హెడ్ శతకాన్ని అందుకున్నాడు. ఈ దశలో ఆసీస్ మిడిలార్డర్ తడబాటుకు లోనై తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయింది.
అయితే చివర్లో మ్యాక్స్‌వెల్ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇన్‌గ్లిస్ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్), ప్యాట్ కమిన్స్ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. ఛేదనను కివీస్ దూకుడుగానే ఆరంభించింది. ఓపెనర్లు యంగ్ (28), కాన్వే (28) సరైన ఆరంభాన్ని ఇవ్వగా, రచిన్ ఆ జోరును కొనసాగించాడు.
రచిన్, మిచెల్ కలిసి 96 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపు దిశగా నడిపించారు. 77 బంతుల్లోనే రచిన్ సెంచరీ పూర్తయింది. 59 బంతుల్లో 96 పరుగులు చేయాల్సిన దశలో రచిన్ వెనుదిరగ్గా... ఆ తర్వాత నీషమ్ బాధ్యతను తీసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ అతని రనౌట్ జట్టు ఓటమిని ఖాయం చేసింది.
స్కోరు వివరాలు
ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) అండ్ (బి) ఫిలిప్స్ 81; హెడ్ (బి) ఫిలిప్స్ 109; మార్ష్ (బి) సాన్‌ట్నర్ 36; స్మిత్ (సి) బౌల్ట్ (బి) ఫిలిప్స్ 18; లబుషేన్ (సి) రవీంద్ర (బి) సాన్‌ట్నర్ 18; మ్యాక్స్‌వెల్ (సి) బౌల్ట్ (బి) నీషమ్ 41; ఇన్‌గ్లిస్ (సి) ఫిలిప్స్ (బి) బౌల్ట్ 38; కమిన్స్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 37; స్టార్క్ (సి) నీషమ్ (బి) హెన్రీ 1; జంపా (బి) బౌల్ట్ 0; హాజల్‌వుడ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 388. వికెట్ల
పతనం: 1–175, 2–200, 3–228, 4–264, 5–274, 6–325, 7–387, 8–388, 9–388, 10–388. బౌలింగ్: హెన్రీ 6.2–0–67–1, బౌల్ట్ 10–0–77–3, ఫెర్గూసన్ 3–0–38–0, సాన్‌ట్నర్ 10–0–80–2, ఫిలిప్స్ 10–0–37–3, రచిన్ 8–0–56–0, నీషమ్ 2–0–32–1.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) స్టార్క్ (బి) హాజల్‌వుడ్ 28; యంగ్ (సి) స్టార్క్ (బి) హాజల్‌వుడ్ 32; రచిన్ (సి) లబుషేన్ (బి) కమిన్స్ 116; మిచెల్ (సి) స్టార్క్ (బి) జంపా 54; లాథమ్ (సి) హాజల్‌వుడ్ (బి) జంపా 21; ఫిలిప్స్ (సి)లబుషేన్ (బి) మ్యాక్స్‌వెల్ 12; నీషమ్ (రనౌట్) 58; సాన్‌ట్నర్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) జంపా 17; హెన్రీ (సి) హాజల్‌వుడ్ (బి) కమిన్స్ 9; బౌల్ట్ (నాటౌట్) 10; ఫెర్గూసన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 383. వికెట్ల పతనం: 1–61, 2–72, 3–168, 4–222, 5–265, 6–293, 7–320, 8–346, 9–383. బౌలింగ్: స్టార్క్ 9–0–89–0, హాజల్‌వుడ్ 9–0–70–2, కమిన్స్ 10–0–66–2, మ్యాక్స్‌వెల్ 10–0–62–1, జంపా 10–0–74–3, మార్ష్ 2–0–18–0.
Comments
Please login to add a commentAdd a comment