పంచెకట్టులో రెచ్చిపోయిన పిచ్చయ్య.. బిత్తరపోయిన బ్రిటిష్‌ దొరలు  | Ball Badminton Arjuna Pichaiah Performance Britishers Surprised | Sakshi
Sakshi News home page

Legendary Badminton Player Arjuna Pitchaiah: పంచెకట్టులో రెచ్చిపోయిన పిచ్చయ్య.. బిత్తరపోయిన బ్రిటిష్‌ దొరలు

Published Mon, Dec 27 2021 2:54 AM | Last Updated on Mon, Dec 27 2021 8:28 AM

Ball Badminton Arjuna Pichaiah Performance Britishers Surprised - Sakshi

ఈనెల 21న 104వ పుట్టినరోజు వేడుకల్లో అర్జున పిచ్చయ్య

బాల్‌ బ్యాడ్మింటన్‌ దిగ్గజం, అర్జున అవార్డు గ్రహీత 104 ఏళ్ల పిచ్చయ్యను ఇంటర్వ్యూ చేసేందుకు ‘సాక్షి’ అనుకోకుండా ఆదివారం ఆయనుంటున్న మనవడి ఇంటికెళ్లింది. పిచ్చయ్య నెమ్మదిగా తన వివరాలు చెప్పారు. ఆయన మనవడు దగ్గరుండి ఆయన చెప్పిన విషయాలను వివరించారు. ‘సాక్షి’తో చివరిసారిగా ఆయన మాటామంతీ.. ‘లగాన్‌’ సినిమాలో అమీర్‌ ఖాన్‌ క్రికెట్‌ ఆడేందుకు బ్యాట్‌ పట్టుకుని పంచెకట్టుతో బరిలోకి దిగుతా డు. బ్రిటిష్‌ దొరలు అతన్ని హేళన చేస్తారు. 2001 నాటి ఈ ముచ్చట చాలామందికి తెలుసు. కానీ సరిగ్గా ఇలాంటి ఉదంతమే నిజ జీవితంలో అంతకు అరవై ఏళ్ల ముందే చోటు చేసుకుంది.  

వరంగల్‌ స్పోర్ట్స్‌: స్వాతంత్య్రానికి పూర్వం 1939– 40లో అప్పటి మద్రాస్‌లో స్టేట్‌ స్టాఫ్‌ క్లబ్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీల్లో ఓ ఆటగాడు నిక్కర్, టీ షర్ట్‌ లాంటి క్రీడా దుస్తులకు భిన్నంగా పంచెకట్టుతో కోర్టులో అడుగు పెట్టాడు. అతడి కాళ్లకు కనీసం బూట్లు కూడా లేవు. అతడిని చూసిన బ్రిటిష్‌ దొరలు, క్రీడా విశ్లేషకులు.. ‘పొలం దున్నుకునే వాడిని బ్యాడ్మింటన్‌ కోర్టుకు ఎందుకు రానిచ్చారు’ అని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ.. మ్యాచ్‌ ముగిసిన తర్వాత వాళ్లకు అర్థమైంది ‘వీడు వచ్చింది కోర్టును దున్నేయడానికి అని..’ నాటి నుంచి వెనుతిరిగి చూడకుండా కోర్టును దున్నేస్తూ చివరికి బాల్‌ బ్యాడ్మింటన్‌లో లెక్కకు మించిన అవార్డుల పంట పండించారు. అతనే మన ‘అర్జున’ పిచ్చయ్య.  

క్లబ్బుల్లో నేర్చుకుని..ఛాంపియన్‌షిప్‌లు గెలిచి 
పిచ్చయ్య సమకాలీకులెవరూ ఇప్పుడు లేరు. మనవడు చెప్పిన వివరాలు, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. పిచ్చయ్య బందరు పట్ట ణంలో మినర్వ క్లబ్, మోహన్‌ క్లబ్‌లలో బాల్‌ బ్యాడ్మింటన్‌ ఆడడం అలవాటు చేసుకున్నారు.  1935–36లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో విజేతగా నిలిచారు. హైదరాబాద్‌ రాష్ట్రంలో చాదర్‌ఘాట్‌లో జరిగిన పోటీల్లో ఆజంజాహి మిల్లు తరఫున ఆడి గెలిచారు. 1954–55లో హైదరాబాద్‌లోనే జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. 15 జాతీయస్థాయి పోటీల్లో కెప్టెన్‌గా వ్యవహరించి 9 ఛాంపియన్‌షిప్‌లను గెలుపొందడంలో కీలకపాత్ర వహించారు. హైదరాబాద్‌ స్టేట్‌ తరఫున 5, ఆంధ్రప్రదేశ్‌ తరఫున 9 జాతీయస్థాయి పోటీల్లో ఆడారు. 1966లో జంషెడ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌ తర్వాత పిచ్చయ్య స్టార్‌ ఆఫ్‌ ఇండియాగా అవతరించారు. 

పిచ్చయ్య పేరుపై రాకెట్లు 
వింబుల్డన్‌ ఆఫ్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ అని పిలిచే మధురై టోర్నీ ఫైనల్లో నాటి మేటి ఆటగాడు దక్షిణామూర్తిపై విజయం సాధించి విజార్డ్‌ ఆఫ్‌ బాల్‌ బ్యా డ్మింటన్‌గా పేరుపొందారు. ఆ మ్యాచ్‌లో పిచ్చయ్య ప్రదర్శన చూసి పంజాబ్‌ జలంధర్‌లో బాల్‌ బ్యా డ్మింటన్‌ రాకెట్లు తయారు చేసే కంపెనీ పిచ్చయ్య పేరుపై రాకెట్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

అప్పట్లో సొంత ఇల్లే లేదు.. 
జాతీయస్థాయిలో ఆడిన పిచ్చయ్యకు అప్పట్లో సొం త ఇల్లూ లేదు. అంత తాహతూ లేదు. దీంతో అప్పటివరకు తనకు వచ్చిన వెండి బహుమతులను అమ్మేయగా రూ.19 వేలు రాగా.. వాటితో 1965లో వరంగల్‌ కృష్ణ కాలనీలో సొంత ఇల్లు కట్టుకున్నట్లు ఆయన స్నేహితులు చెబుతుంటారు. తర్వాత ప్రభు త్వం వరంగల్‌లోని దేశాయిపేటలో 500 గజాల స్థలం కేటాయిస్తే.. పాత ఇల్లు అమ్మి ఇక్కడ కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఆయనకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. 104 ఏళ్ల వయసులోనూ తన పనులు తానే చేసుకునే వారు. శాకాహారం మాత్రమే తీసుకునేవారు. ఆరోగ్యంగా ఉన్న సమయంలో ఎక్కడికైనా సైకిల్‌ పైనే వెళ్లేవారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement